వ్యాపారం చేసి రాణిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెలల వ్యవధిలోనే భారీగా నష్టపోయి, అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి.. మరోసారి వ్యాపారం చేయడానికి పెట్టుబడి సిద్ధం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అప్పు తీర్చడమే కాకుండా.. కొత్త ఏడాదిలో కోటి రూపాయలతో రెండు టిఫిన్ సెంటర్లు కూడా ప్రారంభిస్తాడట. నిరాశతో కూరుకుపోయిన జీవితాన్ని స్వయంకృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన పాతికేళ్ల కుర్రాడి గురించి అక్కడి మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఫుడ్‌డెలివరీ బాయ్‌గా కోట్లు ఎలా సంపాదించాడో గర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్రమ, పట్టుదల ఉంటే అసాధ్యమేదీ కాదని నిరూపించిన చైనా యువకుడు జాంగ్ జుకియాంగ్ గురించి తెలుసుకుందాం.
వ్యాపారంలో నష్టం
దక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన పాతికేళ్ల 'జాంగ్ జుకియాంగ్' 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెలల వ్యవధిలోనే నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. నష్టంతో పాటు అప్పటికే అతనికి 50వేల యువాన్‌లు ఇక్కడి కరెన్సీ ప్రకారం. సుమారు ఆరున్నర లక్షలు అప్పు కూడా అయింది. సర్దుకున్న జాంగ్ నిరాశపడలేదు. ఎలాగోలా ముందుకెళ్లాలని నిర్ణయించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో చేరాడు. ఫుడ్ ఆర్డర్లను సరఫరా చేయసాగాడు. తోటి డెలివరీ బాయ్స్‌లా కాకుండా.. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టకున్నాడు. నెలకు కనీసం ఇక్కడి కరెన్సీలో చూస్తే మూడు లక్షల రూపాయలు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
365 రోజులు పని & రోజుకు 300 పార్శిళ్లు
ఏడాది మొత్తంలో 365 రోజులు పని చేయడం, రోజూ కేవలం విశ్రాంతి, తినడానికయ్యే సమయాన్ని మినహాయించి మిగతా సమయం అంతా ఫుడ్ డెలివరీ కోసం కేటాయించాడు. నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు అంటే సుమారు 14 గంటలు ఫుడ్ డెలివరీ కోసం తిరిగాడు. రోజూ కనీసం 300 పార్శిళ్లను లక్ష్యంగా పెట్టకుని వాటిని కస్టమర్లకు అందజేశాడు. ప్రతిరోజు సుమారు 9 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగతా సమయాన్ని ఫుడ్ డెలివరీకి కేటాయించాడు.
డబ్బు సంపాదన ధ్యేయంగా పని చేసిన జాంగ్ రోజూ 300 పార్శిళ్లు ఇవ్వడం... ప్రతి పార్శిల్‌కు అత్యధికంగా 20 నుంచి25 నిముషాలకు మించి సమయం తీసుకోకుండా త్వరితగతిన డెలివరీ చేయడంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల వ్యవధిలో జాంగ్ డెలివరీ కోసం 3లక్షల 24వేల కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు లక్షన్నరకు పైగా ఫుడ్ డెలివరీ పార్శిళ్లను అందజేశాడు. అతని అంకితభావాన్ని చూసి తోటి ఉద్యోగలు అతనికి ఆర్డర్ కింగ్ అని నామకరణం చేశారు. ఐదేళ్ల కాలంలో జాంగ్ మొత్తం కోటి 80లక్షలు సంపాదించి.. వాటిలో కోటి 42 లక్షలు పొదుపు చేయగలిగాడు. ఆ డబ్బుతో తిరిగి వ్యాపారం చేయడానికి సిద్ధమవుతన్నాడు.


