హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్‌కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.
విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.
సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?
హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్‌షిప్‌లు, విడా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనున్నారు.


