తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్‌లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు.
మనింటి అమ్మాయి
ఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.
ఫ్రెండ్ కోసం స్టాండ్
అతి చనువుకు, లవ్ ట్రాక్‌కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్ క్యారెక్టర్‌ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతూని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది.
శత్రువు కూడా మిత్రువే!
వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.
గెలిచేవరకు పోరాటం
అవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్‌లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్‌బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమ్మాన్యుయేల్‌తో సమానంగా ఈ సీజన్‌ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది.
పారితోషికం ఎంత?
ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.


