దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..
ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్‌లెస్, బ్రాంచ్‌లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.
ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.
అంతేకాకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్‌లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.


