ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్‌పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్‌పతి’ పథకం?
ఇది ఎస్‌బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
రూ.610తో రూ.1 లక్ష ఎలా?
ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే..
‘హర్ ఘర్ లఖ్‌పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.
అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్‌బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.
తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?
త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.
రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..
ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎవరు అర్హులు?
భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు.


