సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి ఏరియాలో కాల్పుల కలకలం రేగింది. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేస్తున్న ఓ వ్యక్తిపై.. గుర్తుతెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. అనంతరం అతని దగ్గరి నుంచి నగదు డబ్బుతో పారిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి గాయాలయ్యాయి.
రిన్షాద్ అనే వ్యక్తి శనివారం ఉదయం 7గం. ప్రాంతంలో తన డబ్బు డిపాజిట్ చేయడానికి కోఠి హెడ్ ఆఫీస్ బయట ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన ఐదుగురు దుండగులు.. తుపాకీతో బెదిరించారు. వాళ్లను అడ్డుకునేందుకు రిన్షాద్ ప్రయత్నించగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రిన్షాద్ కాలి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆపై నగదు బ్యాగుతో బాధితుడి బైక్ మీదే దుండగులు పారిఏపోయారు.


గాయపడిన రిన్షాద్‌ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణహాని తప్పిందని వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న సుల్తాన్‌బజార్ పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.

రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారి అని, తన రూ.6 లక్షల నగుదును డిపాజిట్ చేసేందుకు వచ్చిన క్రమంలోనే చోరీ జరిగిందని ఏసీపీ మీడియాకు వెల్లడించారు. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి రెండు షెల్స్‌ని స్వాధీనం చేసుకున్నాయన్నారు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే కాలిలో కాల్చి నగదు ఎత్తుకెళ్లి ఉంటారని.. నిందితులు పాత నేరస్తులై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారామె. నిందితుల పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.



