రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో పన్నులు, బీమా, పెన్షన్ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గృహ ఆర్థిక పొదుపును పెంచడం, నియంత్రణ సవాళ్లను తగ్గించడం, దేశంలో సామాజిక భద్రత కవరేజీని మెరుగుపరచడం ఈ సూచనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
గృహ ఆర్థిక పొదుపులో బ్యాంకు డిపాజిట్ల వాటా 2024 ఆర్థిక సంవత్సరంలో 38.7 శాతం నుంచి 2025లో 35.2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపును ప్రోత్సహించేందుకు డిపాజిటర్లకు పన్ను ఉపశమన చర్యలు అవసరమని ఎస్బీఐ అభిప్రాయపడింది.
బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి వర్తించే పన్ను విధానాన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల (LTCG, STCG)తో సమానంగా తీసుకురావాలని సూచించింది. అలాగే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ వ్యవధిని మూడేళ్లకు తగ్గించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)తో సమానంగా చేయాలని సిఫార్సు చేసింది. చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలిగించేలా పొదుపు ఖాతాలపై వడ్డీకి వర్తించే టీడీఎస్‌ను పూర్తిగా తొలగించాలని లేదా కనీస పరిమితిని పెంచాలని కూడా ఎస్బీఐ సూచించింది.
పరోక్ష పన్నుల విషయంలో, ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)కు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చట్టం, 2017లోని కొన్ని పదాలను సవరించడం ద్వారా వివాదాలు తగ్గించవచ్చని సూచించింది. అలాగే బ్యాంకులు పంపిణీ చేసే ఐఎస్‌డీపై వాల్యుయేషన్ వివాదాలు లేకుండా ఉండేందుకు సెక్షన్ 20(3)కు వివరణ జోడించాలని ప్రతిపాదించింది.
ఎన్పీసీఐ, వీసా, మాస్టర్‌కార్డ్ వంటి సెటిల్మెంట్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులపై జీఎస్టీ టీడీఎస్ అమల్లో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ టీడీఎస్ వర్తించకుండా మినహాయింపు ఇవ్వాలని ఎస్బీఐ సూచించింది.
బీమా రంగంలో, భారతదేశంలో బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి తగ్గిందని ఐఆర్డీఏఐ డేటాను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతానికి, నాన్-లైఫ్ బీమా 1 శాతానికి పరిమితమైందని పేర్కొంది. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్డీఏఐ లక్ష్యానికి ఇది సవాలుగా మారిందని హెచ్చరించింది. అలాగే 2025లో వచ్చిన ఫిర్యాదుల్లో 69 శాతం క్లెయిమ్స్‌కు సంబంధించినవేనని, ముఖ్యంగా ఆరోగ్య బీమా రంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.
పెన్షన్ రంగంలో కనీస పెన్షన్ హామీతో కూడిన బలమైన, సమగ్ర పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2026లో ఈ సూచనలను అమలు చేస్తే దేశ ఆర్థిక భద్రత బలోపేతమవుతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని ఎస్బీఐ పేర్కొంది.


