breaking news
Union Budget 2026
-
కేంద్ర బడ్జెట్‌పై ఈవీ తయారీదారుల ఆశలు
దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సింహభాగం ఆక్రమించిన మోటార్‌సైకిళ్ల విభాగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహకాలు కేవలం స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలకే పరిమితమవ్వడంపై తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్లోనైనా తమకు తగిన గుర్తింపు, సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తున్నారు.పథకాలు ఉన్నా.. ప్రయోజనం తక్కువే!కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫేమ్-2 (2019-2024) పథకం కానీ, ఇటీవల ప్రారంభించిన పీఎం ఈ-డ్రైవ్ (ప్రధాని ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) స్కీమ్ కానీ ప్రధానంగా ఈ-స్కూటర్లకే మేలు చేశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. ‘భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో దాదాపు 70 శాతం అమ్మకాలు మోటార్‌సైకిళ్లవే. స్కూటర్ల వాటా కేవలం 30 శాతమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్ విభాగంలో స్కూటర్లకే పెద్దపీట వేశారు. ఈ దశలో మోటార్‌సైకిళ్లకు ప్రోత్సాహకాలు అందించకపోతే ఈవీ తయారీ వేగం మందగిస్తుంది’ అన్నారు.పరిశ్రమ డిమాండ్లు ఇవే..అహ్మదాబాద్‌కు చెందిన ‘మ్యాటర్’ వంటి సంస్థలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఈవీ మోటార్‌సైకిల్ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని తయారీదారులు కోరుతున్నారు. కొనుగోలుదారులకు సబ్సిడీలతో పాటు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించాలని చెబుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (PLI) మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బైక్‌లను భారత్‌లోనే తయారు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధిని పరుగులు తీయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది.ఆందోళన కలిగిస్తున్న వృద్ధి రేటువ్యవసాయ రంగ వృద్ధి రేటులో కనిపిస్తున్న మందగమనంపై పీఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు 2025–26 అంచనాల ప్రకారం 3.1 శాతానికి పడిపోయింది. 2020–21లో దేశ మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం వాటా 20.4 శాతం ఉండగా 2023–24 నాటికి అది 17.7 శాతానికి తగ్గింది. గత 5-6 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల సగటు జీవీఏ వృద్ధి 3–4 శాతం వద్దే నిలిచిపోయింది.బడ్జెట్‌పై అంచనాఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు బడ్జెట్లో భారీ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.1. చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి సహకార సంఘాల ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.2. పంట పండించడమే కాకుండా అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం.3. పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతుల కల్పన.4. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల ద్వారా మార్కెట్ అవకాశాన్ని పెంచడం.ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ సమగ్ర గ్రామీణ పునరుజ్జీవన కార్యాచరణ కేవలం వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా గొలుసుల (Supply Chains) ఆధునీకరణ ద్వారా వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీల ప్రభావం తగ్గి నేరుగా రైతుకే లాభం చేకూరే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
బడ్జెట్ సెషన్: కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్-పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వంలో ఆల్‌పార్టీ మీటింగ్ జరుగుతోంది. సెషన్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రం అన్ని పార్టీలను కోరుతున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో.. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే.. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్ఐఆర్ అంశాలపై విపక్షాలు కేంద్రంపై పోరాటానికి దిగాయి. ఈ తరుణంలో బడ్జెట్ సమావేశాలను తమ నిరసనలకు వేదికగా మార్చుకోవాలనుకుంటున్నాయి. చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండడంతో.. తమకు సహకరించాలని అఖిలపక్షం ద్వారా కేంద్రం బతిమాలుతోంది. ఇదిలా ఉంటే.. VIDEO | Delhi: Visuals from all party meeting being held ahead of the Budget Session.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#Delhi pic.twitter.com/GUDbDQmwcQ— Press Trust of India (@PTI_News) January 27, 2026 జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ రేపు.. రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతాయి. కేంద్రం జనవరి 29న ఆర్థిక సర్వే.. ఫిబ్రవరి 1న ఆదివారంనాడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీతో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. అలాగే.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. -
సంస్కరణల బాటా...సుంకాల మోతా..?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను (2026–27 ఆర్థిక సంవత్సరం) వచ్చే నెల (ఫిబ్రవరి) 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. గతేడాది జీఎస్టీలో శ్లాబులను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగానికి ఊతమిచి్చనట్టుగానే.. కస్టమ్స్ సుంకాల్లోనూ ఇదే మాదిరి సంస్కరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి, వాణిజ్య అనిశి్చతులు నెలకొన్న తరుణంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలను ప్రకటించొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. జీడీపీలో రుణ నిష్పత్తిని తగ్గించే మార్గ సూచీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు నిర్వహణకు పరిమితం కాకుండా, రుణ భారాన్ని తగ్గించుకోవడంపై కేంద్ర సర్కారు ఇటీవలి కాలంలో దృష్టి సారించడం తెలిసిందే. ముఖ్య అంచనాలు.. → ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత, కొత్త ఆదాయపన్ను విధానాల్లో స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉంది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలకు మించని ఆదాయంపై పన్ను మినహాయింపును గత బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలోకి మరింత మందిని తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహానికి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలన్న డిమాండ్ ఉంది. → టీడీఎస్ శ్లాబులను తగ్గించొచ్చన్న అంచనా ఉంది. కస్టమ్స్ వివాదాల రూపంలో చిక్కుకుపోయిన రూ.1.53 లక్షల కోట్ల విడుదలకు వీలుగా క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించొచ్చు. అలాగే, నిబంధనల అమలును సులభతరం చేయాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. → రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించొచ్చు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో రక్షణ రంగానికి ఈ విడత మరిన్ని కేటాయింపులు చేయొచ్చు. → వీబీజీ రామ్‌జీ పథకం కింద వ్యయాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకోవచ్చు. → 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ అమలుకు వీలుగా కేటాయింపులు చేయొచ్చు. → 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు పన్నుల పంపిణీ. → టారిఫ్‌ల కారణంగా ప్రభావితమవుతున్న రత్నాభరణాలు, వస్త్రాలు, లెదర్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చు. → లిథియం, కోబాల్ట్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణకు నిధుల మద్దతును ప్రకటించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2026: ఆరోజు నిర్మలమ్మ పలికే పదాలివే..
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించే పదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని పదాలు.. వాటి అర్థాల గురించి తెలుసుకుంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం–వ్యయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.యూనియన్ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.ఫిస్కల్ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్బీఐ) తీసుకునే చర్యలు.బడ్జెట్ ఎస్టిమేట్స్ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.రివైజ్డ్ ఎస్టిమేట్స్ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.ఫినాన్స్ బిల్ (ఆర్థిక బిల్లు): బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.క్యాపిటల్ ఎక్స్పెండీచర్ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.రెవెన్యూ ఎక్స్పెండీచర్ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.ప్రైమరీ డెఫిసిట్ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.రెవెన్యూ డెఫిసిట్ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.నెట్ ఫిస్కల్ డెఫిసిట్ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.క్యాపిటల్ రిసీట్స్ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.రెవెన్యూ రిసీట్స్ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.డైరెక్ట్ ట్యాక్స్ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు. -
1950లో బడ్జెట్ లీక్!.. తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో..గతంలో బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది.. ఈ నార్త్ బ్లాక్‌లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.తరువాత నార్త్ బ్లాక్‌కు..ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్‌కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్లందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు.ఇదీ చదవండి: బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. -
రేపు అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై చర్చ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) ఉదయం గం. 11లకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన ఆర్థికసర్వే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామాన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది. అయితే ఇలా ఆదివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండగా, మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంచితే, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్ఐఆర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఈసారి పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
ఎరువుల దిగుమతి భారం తగ్గించేలా చర్యలు
దేశీయంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాబోయే బడ్జెట్లో ‘ఎరువుల స్వావలంబన మిషన్’ (Mission for Self Reliance in Fertilizer) పేరిట ఒక భారీ పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ మిషన్ ద్వారా ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహానికి పెద్దపీట వేయనున్నారు.లక్ష్యాలు, గడువుప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మిషన్ ద్వారా స్పష్టమైన కాలపరిమితితో కూడిన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఐదేళ్లలో ఎరువుల దిగుమతులను కనీసం 20 శాతం తగ్గించనున్నారు. పదేళ్లలో దిగుమతులను 35 శాతం వరకు కట్టడి చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఏటా వీటి విక్రయాలను 6–7 శాతం తగ్గించడం ద్వారా ప్రస్తుత మితిమీరిన వినియోగాన్ని అదుపులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.రికార్డు స్థాయికి చేరిన విక్రయాలు2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం ఎరువుల విక్రయాలు 655.94 లక్షల టన్నులకు చేరి సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎరువుగా యూరియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో యూరియా విక్రయాలు 387.92 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.4 శాతం వృద్ధిని సూచిస్తుంది.నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ మిశ్రమంతో కూడిన సంక్లిష్ట ఎరువుల (NPK) వినియోగంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇవి 28.2 శాతం వృద్ధితో 149.72 లక్షల టన్నుల విక్రయాలను నమోదు చేశాయి.పొటాష్ ఎరువుల విషయానికి వస్తే, ఎంఓపీ (మూరియేట్ ఆఫ్ పొటాష్) విక్రయాలు అత్యధికంగా 33.9 శాతం వృద్ధి చెంది 22.02 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.అన్ని ఎరువుల విక్రయాలు పెరిగినప్పటికీ DAP (డై-అమోనియం ఫాస్ఫేట్) విక్రయాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. గతంలో 109.74 లక్షల టన్నులుగా ఉన్న DAP విక్రయాలు, ఈసారి 96.28 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. నవంబర్ మధ్య వరకు నెలకొన్న సరఫరా కొరత కారణంగానే ఈ తగ్గుదల నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.సబ్సిడీ భారం.. సమన్వయ వ్యూహంప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.1,67,899.5 కోట్లు కేటాయించింది. అయితే, ఫాస్ఫేటిక్, పొటాష్ ఎరువుల సబ్సిడీని రూ.49,000 కోట్ల నుంచి ఏకంగా రూ.75,000 కోట్లకు పెంచాల్సి వచ్చింది. ఈ భారీ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది.1. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ‘పీఎం-ప్రణామ్’ పథకాన్ని కొత్తగా రాబోయే ఎరువుల మిషన్‌లో విలీనం చేయాలని యోచిస్తున్నారు.2. ‘నేచరల్ ఫార్మింగ్ మిషన్’కు నిధుల కేటాయింపులను పెంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులను ప్రోత్సహించడం.3. తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా కొత్త వంగడాలు, సాంకేతికతలను అభివృద్ధి చేసే బాధ్యతను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR)కి అప్పగించనున్నారు.రసాయన ఎరువుల వాడకం పర్యావరణంపై, ప్రభుత్వ ఖజానాపై చూపుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ‘ఎరువుల మిషన్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
వ్యూహాత్మక వృద్ధి దిశగా అడుగులు
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు.. అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సమగ్ర విధాన పత్రం. 2026 బడ్జెట్‌పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025లో చేపట్టిన కీలక కార్పొరేట్ సంస్కరణలను కొనసాగిస్తూనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది.సంస్కరణల కొనసాగింపుగత ఏడాది ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపార నిర్వహణ సౌలభ్యం)లో భాగంగా అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ కార్పొరేట్ విధానాలను సరళీకరించేందుకు ఎంసీఏ వీ3 ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డైరెక్టర్ల కేవైసీ ప్రక్రియను సులభతరం చేసింది. చిన్న కంపెనీలకు ఊతం ఇచ్చేలా వాటి విలీనాలు, ఇతర అనుబంధ సంస్థల విడదీత కోసం ఫాస్ట్‌ట్రాక్ విధానాన్ని విస్తరించింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ వివాదాల మధ్య కూడా భారత్ స్థిరమైన విదేశీ పెట్టుబడులను (FDI) ఆకర్షించగలిగింది. ఈ ఊపును 2026లోనూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.రక్షణ రంగంలో సడలింపులు?రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో రక్షణ రంగ విదేశీ పెట్టుబడుల పరిమితిని సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐదో తరం యుద్ధ విమానాల తయారీ, కీలక విడిభాగాల ఉత్పత్తి కోసం పెట్టుబడులను పెంచడం ద్వారా గ్లోబల్ కంపెనీలను భారత్‌కు రప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పౌర, రక్షణ డ్రోన్ల తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేసే ప్రకటనలు వెలువడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.సెమీకండక్టర్ మిషన్భవిష్యత్తు అవసరాలైన సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ రంగాలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేయనుంది. రీసైక్లింగ్ ద్వారా ఖనిజాలను పొందడంపై దృష్టి సారించేలా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశీయ ఎకోసిస్టమ్‌ను నిర్మించే స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాల అందించేందుకు సెమీకండక్టర్ మిషన్ తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సమగ్ర కృత్రిమ మేధ (AI) ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటును వేగవంతం చేస్తారని చెబుతున్నారు.వాణిజ్య ఒప్పందాలు2025-26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సూచించినట్లుగా ఎగుమతుల వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) కీలకం కానున్నాయి. ప్రధాన దేశాలతో పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలను ముగించడం ద్వారా భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మార్గం సుగమం చేయడమే దీని లక్ష్యం.కార్పొరేట్ చట్టాల సరళీకరణ‘కంపెనీస్ (సవరణ) బిల్లు-2025’ ద్వారా కార్పొరేట్ నేరాల డీక్రిమినలైజేషన్ (శిక్షల తొలగింపు) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్నపాటి సాంకేతిక లోపాలకు జైలు శిక్షల వంటివి తొలగించి జరిమానాలతో సరిపెట్టడం ద్వారా వ్యాపారవేత్తల్లో భరోసా కల్పించాలని చూస్తోంది. వీటితో పాటు స్టాంప్ డ్యూటీ సంస్కరణలు, ఏపీఐ(ఫార్మా) తయారీకి ప్రోత్సాహకాలు, వైద్య పరికరాల పునర్నిర్మాణ విధానం తీసుకువచ్చేలా చర్యలు సాగుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
బడ్జెట్, ఫెడ్ పైనే ఫోకస్
వచ్చే నెల తొలి రోజున కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌కు తెరతీయనుంది. మరోపక్క బుధవారం(28న) యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సమీక్ష చేపట్టనుంది. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతోపాటు ఫిబ్రవరి సిరీస్ ప్రారంభంకానుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు(26న) స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ఆదివారం(ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆదివారం సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలు ట్రేడింగ్‌కు వీలు కల్పిస్తున్నాయి. ఎన్ఎస్ఈలో జనవరి ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు రేపు(27న) ముగియనుంది. బీఎస్ఈలో వీటి ఎక్స్ పైరీ గురువారం(29న)కాగా.. రెండు ఎక్సే్ఛంజీలలోనూ ఫిబ్రవరి సిరీస్ ప్రారంభంకానుంది. కాగా.. యూరోపియన్ యూనియన్– భారత్ మధ్య వాణిజ్య డీల్ కుదిరితే ఇన్వెస్టర్లకు ఉపశమనం లభించే వీలుంది. వడ్డీ తగ్గించేనా? కొత్త ఏడాదిలో రెండురోజులపాటు నిర్వహిస్తున్న తొలి పాలసీ సమీక్షా సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని ఆ ర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ద్రవ్యోల్బణం, ఉపాధిసహా.. ఫెడ్ చైర్మన్ పావెల్‌పై రాజకీయంగా, లీగల్‌గా ఒత్తిడి కొనసాగుతుండటం ప్రభా వం చూపవచ్చని పేర్కొన్నారు. వెరసి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.5–3.75 శాతంవద్దే కొనసాగే వీలుంది. గురువారం(29న) నవంబర్ నెలకు యూఎస్ వాణిజ్య గణాంకాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌లో వాణి జ్య లోటు 29.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇతర దేశీ అంశాల ఎఫెక్ట్ → విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే కట్టుబడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 36,591 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో రూపాయిపై సైతం ఒత్తిడి పడుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతు న్నారు. వెరసి డాలరుతో మారకంలో రూపాయి గత వారం 91.97కు పతనమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. → 2025 డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు 28న విడుదలకానున్నాయి. నవంబర్‌లో ఐఐపీ 6.7 % ఎగసింది. → మరిన్ని దిగ్గజాలు 2026 క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, మారుతీ, ఐటీసీ, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ తదితరాలున్నాయి. మరింత డీలా.. → గత వారం సెంటిమెంటు బలహీనపడటంతో మార్కెట్లు పతన బాటలో సాగాయి. సెన్సెక్స్ 2,033 పాయింట్లు క్షీణించి 81,538 వద్ద నిలిచింది. నిఫ్టీ 646 పాయింట్లు పడిపోయి వద్ద 25,049 ముగిసింది. → ఈ వారం సైతం అమ్మకాలతో మార్కెట్లు మరింత నీరసించవచ్చని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అంచనాల ప్రకారం నిఫ్టీకి 24,300– 24,000 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభించవచ్చు. బలపడితే 25,400– 25,600 పాయింట్లకు చేరే వీలుంది. → సెన్సెక్స్ 80,000– 79,500 పాయింట్ల స్థాయిలో మద్దతు అందుకునే వీలుంది. ఒకవేళ ఊపందుకుంటే 82,000–82,600 పాయింట్లవరకూ బలపడవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
పన్నులు తగ్గించాలని, బయో ఇంధనాలకు నిధుల మద్దతును వచ్చే బడ్జెట్లో (2026 –27) ప్రకటించాలంటూ వ్యవసాయం, అనుబంధ రంగాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరాయి. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సంస్కరణల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత వ్యవసాయ రంగం పోటీపడే విధంగా, వృద్ధికి చోదకంగా తీర్చిదిద్దాలని సూచించారు.బయో ఇంధనాలు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (పెట్రోలియానికి ప్రత్యామ్నాయ ఇంధనం), గ్రీన్ హైడ్రెజన్కు రూ.2,500 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (ఏఐఎస్‌టీఏ) డిమాండ్ చేసింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న చక్కెర మిల్లులు బయో ఇంధన కేంద్రాలుగా (ఇథనాల్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు) అవతరించేందుకు మరో రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరింది.ఒక కిలో హైడ్రోజన్ కోసం 70 యూనిట్ల విద్యుత్ అవసరమని.. అదే హైడ్రోజన్ తయారీకి ఇథనాల్ వినియోగించినట్టయితే చక్కెర పరిశ్రమకు మేలు జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని, లీటర్ ఇథనాల్ కొనుగోలు ధరను రూ.6–8 పెంచాలని కోరింది. చక్కెర కిలో కనీస విక్రయ ధరను రూ.31 నుంచి పెంచాలని డిమాండ్ చేసింది. ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి.. అవశేషాలు లేని, పోషకాలు పుష్కలంగా ఉండే సాగును ప్రోత్సహించాలని సొల్యుబుల్ ఫెర్టిలైజర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాజిబ్ చక్రవర్తి కేంద్రాన్ని కోరారు. సబ్సిడీల్లేని సొల్యుబుల్, ఆర్గానిక్, మైక్రో న్యూట్రియంట్, స్టిమ్యులంట్ ఫెర్టిలైజర్‌ను కీలక పదార్థాలుగా గుర్తించాలని సూచించారు. పెరిగిపోయిన వాతావరణ మార్పులు, అధి క సాగు వ్యయాలు, కారి్మకుల వ్యయాలతో కాఫీ రంగం సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు కేలచంద్ర కాఫీ ఎండీ రాణా జార్జ్ పేర్కొన్నారు. సాగు బీమాతోపాటు, దీర్ఘకాలానికి రుణ సాయం అందించాలని కోరారు. వాతావరణ మార్పులను తట్టుకోగల రకాలపై పరిశోధనలకు పెట్టుబడుల సాయం అందించాలని డిమాండ్ చేశారు. -
28 నుంచి బడ్జెట్ సెషన్ 27న అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: జనవరి 28వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగా 27వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎజెండాతోపాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని కమిటీ మెయిన్ రూంలో 27వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూపీయే హయాంలో తీసుకువచి్చన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థాయిలో కేంద్రం ఇటీవల తీసుకువచి్చన వీబీ– గ్రామీణ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక వైపు దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తుండగా, మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన వేళ పార్లమెంట్ సెషన్ మొదలవుతుండటం గమనార్హం. ఈ నెల 28వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం కానుంది. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత అరుదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ, ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం తెల్సిందే. -
బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్
2026 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే ఈ టైమ్ 1999 నుంచి మారిపోయింది. టైమ్ ఎందుకు మారింది?, దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించడం ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం. ఇండియా టైమ్.. యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT (లండన్‌లోని గ్రీన్విచ్ వద్ద ఉన్న ప్రైమ్ మెరిడియన్ ఆధారంగా లెక్కించే ప్రపంచ ప్రామాణిక సమయం) ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది. -
దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.1860లో మొదటి బడ్జెట్1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.స్వాతంత్య్రం వచ్చిన తరువాతభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్‌ను ఒక మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు.వీటికే ప్రాధాన్యతతొలి బడ్జెట్లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంతొలి బడ్జెట్లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి.. -
కేంద్ర బడ్జెట్ 2026: పన్ను రాయితీలు కల్పించాలి
న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్లో తమకు పన్నుల్లో రాయితీలు కల్పించాలని, సుంకాలను క్రమబద్దీకరించాలని, అంతర్జాతీయంగా బ్రాండింగ్, మార్కెటింగ్‌కు సహకారం అందించాలని ఎగుమతి దారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇన్వర్టెడ్ కస్టమ్స్ డ్యూటీ స్ట్రక్చర్ పరంగా ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.తుది ఉత్పత్తుల కంటే విడిభాగాలు, ముడి సరుకులపై పన్ను రేట్లు అధికంగా ఉండడాన్ని ఇన్వర్టెడ్ కస్టమ్స్ డ్యూటీ స్ట్రక్చర్‌గా చెబుతారు. ఎగుమతులకు ఉద్దేశించిన కీలక విడిభాగాలు, ముడి సరుకుల దిగుమతులపై సుంకాలను క్రమబద్దీకరించాలని, దీనివల్ల తయారీ వ్యయాలు దిగొస్తాయని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. తుది వ్రస్తాల కంటే సింథటిక్ యార్న్, ఫైబర్‌పై కస్టమ్స్ డ్యూటీ అధికంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇది టెక్స్టైల్ వ్యాల్యూ చైన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పేర్కొంది.అలాగే, ఎల్రక్టానిక్స్ తుది ఉత్పత్తుల కంటే ఎలక్టాన్రిక్స్ విడిభాగాలైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కనెక్టర్లు, సబ్ అసెంబ్లీలపై అధిక సుంకాలు పడుతున్నాయంటూ.. ఇది దేశీయంగా వ్యాల్యూ చైన్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది. కెమికల్, ప్టాస్టిక్స్ రంగంలోనూ ముడి పదార్థాలలైన కెమికల్స్, పాలీమర్స్‌పై అధికంగా సుంకాలు అమలవుతున్నాయని, లెదర్ పరిశ్రమలోనూ ఇదే విధానం ఉన్నట్టు తెలిపింది.‘‘కనుక ముడి సరుకులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఈ లోపాలకు చెక్ పెట్టాలి. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయి. మూలధన నిధుల పరంగా ఒత్తిళ్లు తగ్గుతాయి. దేశీ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. భారత ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుంది’’అని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ పేర్కొన్నారు.ప్రపంచస్థాయి షిప్పింగ్ లైన్స్.. ప్రపంచ స్థాయి షిప్పింగ్ లైన్స్ (ఆపరేటర్లు) అభివృద్ధికి విధానపరమైన, ద్రవ్యపరమైన మద్దతు అందించాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ రల్హాన్ కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం విదేశీ షిప్పింగ్ లైన్స్‌పై ఆధారపడడం వల్ల రవాణా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు చెప్పారు. సరఫరా వ్యవస్థలో సమస్యలను, రవాణా చార్జీల్లో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు తెలిపారు.ఇక కొత్త తయారీ యూనిట్లకు 15 శాతం రాయితీ కార్పొరేట్ పన్ను రేటును మరో ఐదేళ్ల కాలానికి పొడిగించాలని కూడా కోరారు. రాయితీ రేట్లపై రుణాలను అందించాలని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) కేంద్రానికి సూచించింది. టెక్స్టైల్ మెషినరీపై జీఎస్టీని తగ్గించాలని, చిన్న యూనిట్లకు టెక్నాలజీ నవీకరణ కోసం పథకాన్ని ప్రకటించాలని ఏఈపీసీ చైర్మన్ శక్తివేల్ డిమాండ్ చేశారు. -
బడ్జెట్ 2026.. ఆదివారం సెలవు లేదు!
కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన, అంతే కాకుండా ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా పెట్టుబడిదారుల కోసం తెరిచి ఉంటుందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించాయి.సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు, కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు లేదన్నమాట).బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. -
బడ్జెట్ 2026లో వ్యవసాయానికి కొత్త దిశ!
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులు, అస్థిరమైన మార్కెట్ ధరల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026)లో వ్యవసాయాన్ని లాభసాటిగా, సుస్థిరంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి సాంకేతికతతో కూడిన ‘స్మార్ట్ అగ్రికల్చర్’ వైపు అడుగులు వేయడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.వాతావరణానికి అనువైన వ్యవసాయంమారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం స్థితిస్థాపక వ్యవసాయంపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంలో కింది అంశాలను పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు.కరువును, వరదలను తట్టుకునే అత్యధిక నాణ్యత గల విత్తనాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు నిధులు పెంచడం.నీటి యాజమాన్యంలో భాగంగా సూక్ష్మ సేద్యం, భూసార పరిరక్షణ కోసం రైతులకు సబ్సిడీలు అందించడం.రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని కాపాడటం.పీపీపీ మోడల్‌తో మౌలిక సదుపాయాలుప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట నష్టాన్ని తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పెట్టుబడులతో అధునాతన కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల నిర్మించాలని వ్యవసాయ సంఘాలు చెబుతున్నాయి. రైతుల నుంచి నేరుగా మార్కెట్‌కు పంటను తరలించేలా రవాణా నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న అధునాతన యంత్రాలను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేస్తే మరింత ఉత్పాదకత సాధ్యం అవుతుంది.అధిక విలువ కలిగిన పంటలువరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే హార్టికల్చర్ (ఉద్యానవన పంటలు)పై బడ్జెట్ దృష్టి సారించాలి. తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పండ్లు, ఔషధ మొక్కల సాగుకు ప్రోత్సాహకాలు అందించాలి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.రైతన్నకు ‘స్మార్ట్’ అండసాంకేతికతను సామాన్య రైతుకు చేరువ చేయడమే డిజిటల్ ఇంటిగ్రేషన్ లక్ష్యం. మొబైల్ యాప్‌ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నివారణా చర్యలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ డేటాతో అనుసందానించి అందించాలి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించేలా ‘ఈ-నామ్’ (e-NAM) వంటి ప్లాట్‌ఫామ్‌లను మరింత బలోపేతం చేయాలి. పంటల అంచనా, రుణాల మంజూరు సులభతరం చేసేందుకు వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలి.సుస్థిర సాగు, ప్రైవేటు పెట్టుబడులు, డిజిటల్ విప్లవంతో కూడిన వ్యూహం అమలులోకి వస్తే భారత వ్యవసాయ రంగం మరిన్ని ఫలితాలు సాధిస్తుంది. బడ్జెట్ 2026లో చేసే కేటాయింపులు అన్నదాతకు భరోసా కల్పించడమే కాకుండా దేశ ఆహార భద్రతను మరింత పటిష్టం చేస్తాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
డిజిటల్ భారత్ ముంగిట కొత్త విప్లవం
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కేవలం అగ్రరాజ్యాల నమూనాలను అనుకరించకుండా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’(SLM) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ స్వదేశీ ఏఐ నమూనాల పట్ల కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.ఎల్ఎల్ఎం Vs ఎస్ఎల్ఎం.. భారత్‌కు ఏది ముఖ్యం?గత కొన్ని ఏళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ పారామీటర్లతో కూడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను అభివృద్ధి చేశాయి. ఇవి శక్తివంతమైనవి అయినప్పటికీ వీటి నిర్వహణకు భారీ ఖర్చు, అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి పౌరుడికి ఏఐ సేవలు అందాలంటే ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (SLMs)’ సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు.ఇవి అతి తక్కువ కంప్యూటింగ్ శక్తితో పని చేస్తాయి. ప్రాంతీయ భాషలు, మాండలికాలపై ప్రత్యేక శిక్షణ పొందుతాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ప్రత్యేకంగా వీటిని రూపొందించవచ్చు.భాషా వైవిధ్యానికి ఏఐ అండదేశంలో వందల సంఖ్యలో భాషలు, మాండలికాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ మోడల్స్ స్థానికంగా ఉన్న అన్ని భాషల్లో ప్రావీణ్యం సాధించాలంటే కష్టం. ఈ లోటును పూడ్చడానికి ‘సర్వం 1’ (Sarvam 1) వంటి మోడల్స్ ఇప్పటికే పునాది వేశాయి. ఇది 10 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే 2 బిలియన్ పారామీటర్ మోడల్. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ జెన్’ (BharatGen) వంటి కార్యక్రమాలు స్వదేశీ ఏఐ అభివృద్ధిలో వేగం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థాయుల్లోని వారి అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాలను నిర్మించడం కీలకం.బడ్జెట్ 2026లో ఆశించేవి..2026 బడ్జెట్లో ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) విస్తరణకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.1. క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం.2. వ్యవసాయం, గ్రామీణ పాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రాంతీయ లాంగ్వేజ్ డేటా సేకరణకు ప్రత్యేక నిధులు.3. ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడానికి విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు.దేశంలో 85.5 శాతం కుటుంబాల వద్ద స్మార్ట్ఫోన్లు, 86.3 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తరుణంలో స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ విప్లవం ఉత్పాదకతను పెంచడమే కాకుండా సామాన్యుడికి డిజిటల్ సేవలను చేరువ చేస్తుంది. స్వదేశీ ఏఐ ద్వారా భారతదేశం గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా ఎదగడమే కాకుండా, తన సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని సాంకేతికతతో అనుసంధానించనుంది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
నార్త్ బ్లాక్‌లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ
దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్ భవనంలోని నార్త్ బ్లాక్‌లోనే కొనసాగనుంది.కొత్త భవనంలో లేని సౌకర్యంకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్‌లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్‌లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్ బిల్డింగ్‌లోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ప్రెస్లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్ రోడ్డులోని ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్ బ్లాక్‌లోని ప్రత్యేక ప్రెస్‌కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రతబడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్ బ్లాక్‌లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.త్వరలో ‘హల్వా వేడుక’బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
చిక్కుముడిలో రూ.1.52 లక్షల కోట్లు.. ప్రభుత్వం క్షమాభిక్ష?
న్యూఢిల్లీ: కస్టమ్స్ సుంకం వివాదాల్లో రూ.1.52 లక్షల కోట్ల మొత్తం చిక్కుకుపోయినందున, వాటికి ముగింపు పలికి, వ్యాపార సంస్థలకు స్పష్టతనిచ్చేందుకు 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించే అవకాశముందని ప్రైస్ వాటర్‌హౌస్ అండ్ కో తెలిపింది. ఈ దిశగా పరిశ్రమ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది.పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నందున కస్టమ్స్ సుంకాల్లో శ్లాబులను ప్రస్తుతమున్న 8 నుంచి 5–6కు తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించొచ్చని అంచనా వేసింది. తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరల కంటే.. వాణిజ్య ఒప్పందాల ఫలితంగా దేశంలోకి దిగుమతి అవుతున్న తుది ఉత్పత్తులు చౌకగా మారాయని, కనుక ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాల్సిన సమయం ఇదేనని పేర్కొంది.న్యూజిలాండ్, యూకే, ఒమన్ తదితర దేశాలతో భారత్ ఎఫ్‌టీఏలు కుదుర్చుకోవడాన్ని ప్రస్తావించింది. 2025–26 బడ్జెట్లోనూ కేంద్రం కస్టమ్స్ డ్యూటీలను హేతుబద్దీకరించి, సుంకాల శ్లాబులను 8కి తగ్గించినట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి 38,014 కేసులు వివాదాల్లో ఉన్నట్టు పేర్కొంది.చిక్కుముడి ఎందుకంటే..అధికారులు జారీ చేసే కస్టమ్స్ డ్యూటీ డిమాండ్లను దిగుమతి, ఎగుమతిదారులు విభేదించి చెల్లించకపోవడంతో కేసులు ఏర్పడ్డాయి.కస్టమ్స్ వర్గీకరణ, ఉత్పత్తి విలువ, మినహాయింపు లాంటి వివాదాలు చాలా కాలం నలుగుతూ రావడం వల్ల ఇంత మొత్తంలో కస్టమ్స్ బకాయిలు పేరుకుపోయాయి.దీర్ఘకాల లిటిగేషన్ కారణంగా కంపెనీల డబ్బు స్తంభించడం వల్ల వాణిజ్యం, పెట్టుబడులపైనా ప్రభావం పడుతోంది.ఇంత మొత్తంలో కస్టమ్స్ బకాయిలు వివాదాల్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో దీనికో పరిష్కారం చూపేందుకు వచ్చే 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రకటిస్తుందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2026: బియ్యం ఎగుమతులను ప్రోత్సహించండి
పన్ను ప్రోత్సాహకాలు, రుణాలపై వడ్డీ రాయితీలు, రవాణా పరమైన మద్దతు చర్యలను 2026–27 బడ్జెట్లో ప్రకటించాలని భారత బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్ఈఎఫ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ఈ రంగం పోటీతత్వం బలపడుతుందని పేర్కొంది. ఎగుమతుల కోసం తీసుకునే రుణాలపై 4 శాతం మేర వడ్డీలో రాయితీ కల్పించాలని.. అలాగే, రోడ్డు, రైలు రవాణాపై వ్యయాలపైనా 3 శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది.ఎగుమతులపై సుంకాలు, పన్నుల మినహాయింపులను సకాలంలో అందించాలని పేర్కొంది. ఈ చర్యలతో వ్యయాలు తగ్గుతాయని, ఎగుమతులు పెరుగుతాయని సూచించింది. అంతర్జాతీయంగా బియ్యం వాణిజ్యంలో భారత్ వాటా 40 శాతంగా ఉంటుందని, 2024–25లో 170కు పైగా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు జరిగినట్టు ఐఆర్ఈఎఫ్ ప్రెసిడెంట్ ప్రేమ్ గార్గ్ తెలిపారు.రైతుల ఆదాయానికి, గ్రామీణ ఉపాధికి బియ్యం ఎగుమతులు ఎంతో కీలకమన్న విషయాన్ని గుర్తు చేశారు. విలువైన వరి రకాలకు (ప్రీమియం బాస్మతి, ఆర్గానిక్/నాన్ బాస్మతి రకాలు) మళ్లేందుకు ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రకటించాలని ఈ సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది.


