హైస్పీడ్‌గా రైల్‌ | Seven new high speed corridors in the country | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌గా రైల్‌

Feb 2 2026 3:18 AM | Updated on Feb 2 2026 11:08 AM

Seven new high speed corridors in the country

దేశంలో ఏడు కొత్త హైస్పీడ్‌ కారిడార్లు

వీటిలో పుణే–హైదరాబాద్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై కూడా...

తూర్పు నుంచి పశ్చిమానికి డెడికేటెడ్‌ రవాణా కారిడార్‌

రైల్వే శాఖకు రూ.2.77 లక్షల కోట్ల కేటాయింపు

లోకోమోటివ్స్, వేగన్లు కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు 

రైల్వే భద్రతపై ఫోకస్‌: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్‌ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అభివృద్ధి అనుసంధానకర్తగా భావించే ఈ కారిడార్లను ముంబై–పుణే, పుణే–హైదరాబాద్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఏర్పాటుచేయాలని ప్రకటించింది. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2,77,830 కోట్లను కేటాయించారు. దీంతోపాటు అదనపు బడ్జెటరీ వనరుల నుంచి రూ.15 వేల కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌ పత్రంలో పేర్కొన్నారు. ఈ నిధులతో కొత్తలైన్ల నిర్మాణ,ం లోకోమోటివ్స్, కోచ్‌లు, వేగన్ల కొనుగోలు, ఇతర పనులు చేపడతారు. 2025–26లో రైల్వేకి 2,52,000 కోట్లు కేటాయించగా, ఈసారి 10.25 శాతం ఎక్కువగా కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేకి చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. 

రవాణా కారిడార్‌
» సుస్థిర రవాణా కోసం డెడికేటెడ్‌ రవాణా కారిడార్‌ (డీఎఫ్‌సీ)ను డాంకునీ (పశ్చిమబెంగాల్‌) నుంచి సూరత్‌ (గుజరాత్‌) వరకు 2.052 కి.మీ. నిడివి తో ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీన్ని తూర్పు– పశ్చిమ డీఎఫ్‌ఏసీగా పేర్కొంటారు.
» అధిక రద్దీ ఉండే 18 వేల కి.మీ. ట్రాక్‌ మార్గంలో భద్రతకు నిర్దేశించిన కవచ్, సీసీటీవీ కెమెరాలు, టెలికం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రైల్వే నెట్‌వర్క్‌ మొత్తానికి కవచ్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలని బడ్జెట్‌ లో పేర్కొన్నారు
» దేశీయ కంటెయినర్‌ తయారీ కోసం కొత్త పథకం ప్రవేశపెడుతూ రూ.10వేల కోట్లు కేటాయించారు. 
» లోకోమోటివ్స్, వేగన్లు తదితరాల కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు కేటాయించారు. దీంతో మరిన్ని వందేభారత్‌ రైళ్లు, 24–కోచ్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకుంటారు.
» అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. 
» కొత్త లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, రూ. గేజ్‌ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ. 37,750 కోట్లు కేటాయించారు.

రూపురేఖలు మారిపోతాయి
హైస్పీడ్‌ రైల్వే కారిడార్ల నిర్మాణంతో దేశ రవాణారంగం రూపురేఖలు మారిపోతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఏడు కారిడార్లు మొత్తం 4000 కి.మీ. నిడివితో విస్తరించి ఉంటాయని తెలిపారు. బడ్జెట్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రూ.1.20 లక్షల కోట్లు ప్రయాణికులు, భద్రత కోసం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతపై రైల్వే ఎక్కువ ఫోకస్‌ పెట్టిందని, దీనివల్ల 95 శాతం రైలు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ముంబై–అహ్మదాబాద్‌ మధ్య తొలిసారి చేపట్టిన హైస్పీడ్‌ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.  – రైల్వే మంత్రి

3,547.32 కోట్ల మిగులు
రైల్వే శాఖకు వచ్చే సంవత్సరంలో రూ.3,85,733.33 కోట్ల ఆదాయం వస్తుందని, రూ. 3,82,186.01 కోట్లు వ్యయమవుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 3,547.32 కోట్లు మిగులుతుందని భావిస్తున్నారు. 2024–25లో రైల్వేకి రూ. 3,35,757.09 కోట్ల ఆదాయం సమకూరగా, రూ.3,32,440.64 కోట్లు వ్యయమైంది. రూ.3,316.45 కోట్లు మిగులు వచ్చింది.  

మ్యాచ్‌ సమ్మరీ
వందే భారత్‌తో రైల్వే శాఖ బౌలింగ్‌ స్పీడు పెరిగింది. ఆ స్పీడు మరింత పెంచేందుకు వీలుగా... ఎంత ఫాస్ట్‌ బౌలింగ్‌నైనా తట్టుకునేందుకు తగ్గ పిచ్‌లు తయారు చేయాలని మోదీ సర్కారు సంకల్పించింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే కొత్త రైళ్లు హైస్పీడ్‌ బంతుల్లా దూసుకెళతాయి. 

స్థిరమైన ఆటకు తగ్గ పిచ్‌లా సరకు రవాణాను గాడిలో పెట్టడానికి డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ అక్కరకొస్తుంది. కవచ్, సీసీటీవీలతో భద్రతపై పెట్టే వ్యయం... నోబాల్స్,  వైడ్స్‌కు అడ్డుకట్ట వేస్తుంది. రూ.2.77 లక్షల కోట్ల భారీకేటాయింపుతో ఈ బడ్జెట్‌లో రైల్వే మామూలు ఓవర్‌ కాదు. దేశ రవాణాను వేగంగా నడిపించే పవర్‌ స్పెల్‌ వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement