చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారింది
ఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్‌లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.
ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్‌కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్‌లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.
అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్‌కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.


