తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌ | Identity Weaponised: Gambhir Files Rs 2 5 Cr Lawsuit Delhi HC Details | Sakshi
Sakshi News home page

వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

Mar 19 2026 5:03 PM | Updated on Mar 19 2026 6:14 PM

Identity Weaponised: Gambhir Files Rs 2 5 Cr Lawsuit Delhi HC Details

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్‌ఫేక్స్‌ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.

హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లుగా
సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్‌ఫేక్స్‌ పెరిగిపోయాయని గంభీర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్‌ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్‌ రావడం గమనార్హం.

ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్ట
ఇక మరో వీడియోలో గంభీర్‌ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్‌ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్‌ కోర్టును ఆశ్రయించాడు.  తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

చట్టబద్ధంగా రక్షణ కల్పించాలి
తన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్‌ఫేక్‌ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్‌ కోరాడు.

కాగా 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు గంభీర్‌. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్‌-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోచ్‌గా గంభీర్‌ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.

చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్‌ రిక్వెస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement