పార్లమెంట్‌ అంటే ఓపెన్‌ యూనివర్సిటీ | Parliament as an open university says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ అంటే ఓపెన్‌ యూనివర్సిటీ

Mar 19 2026 5:19 AM | Updated on Mar 19 2026 5:21 AM

Parliament as an open university says PM Narendra Modi

రాజకీయాల్లో నాయకులకు పదవీ విరమణ ఉండదు: మోదీ 

రాజ్యసభలో 59 మంది ఎంపీలకు వీడ్కోలు  

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ అంటే ఒక ఓపెన్‌ యూనివర్సిటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్‌ సభ్యత్వం ముగిసినప్పటికీ సభ్యులు ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉండాలని అన్నారు. రాజకీయాల్లో ఫుల్‌స్టాప్‌ ఉండదని ఉద్ఘాటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రాజ్యసభ సభ్వత్వం ముగుస్తున్న 59 మంది సభ్యులు ఇన్నాళ్లూ అందించిన సేవలను ప్రధానమంత్రి కొనియాడారు. 

ఆయా సభ్యులకు బుధవారం రాజ్యసభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించిన ప్రధాని మోదీ మాట్లాడారు. ఇలాంటి వీడ్కోలు సందర్భాలు సహజంగానే రాజకీయ విభేదాలను తొలగిస్తాయని అన్నారు. సహజంగా, అప్రయత్నంగా రాజకీయ విభేదాలకు అతీతంగా వ్యవహరిస్తామని, మనందరిలో ఒక ఉమ్మడి భావన ఉద్భవిస్తుందని వ్యాఖ్యానించారు. సభకు ఇక తిరిగి వచ్చే ఆలోచన లేని సభ్యులకు భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పూర్తి విరామం అనేది ఎప్పుడూ ఉండదన్నారు. భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తోందని సూచించారు.

 మీ అనుభవం, సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్పష్టంచేశారు. మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ దిగ్గజాలైన ఆ ముగ్గురు నేతలు జీవితంలో సగానికి కంటే ఎక్కువ భాగం పార్లమెంట్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు. అంకితభాతంలో పార్లమెంట్‌కు హాజరయ్యారని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంట్‌ సభ్యులుగా కొనసాగడం సాధారణ విషయం కాదన్నారు.  

మాతో ప్రేమ, మోదీతో పెళ్లి: ఖర్గే  
రాజ్యసభ కార్యకలాపాల నిబంధనలను సమీక్షించాలని సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. సభను మరిన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రతిపక్ష సభ్యుల భాగస్వామ్యం మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. లేకపోతే పార్లమెంట్‌ ప్రతిష్ట బలహీనపడుతుందని చెప్పారు. 59 మంది సభ్యుల వీడ్కోలుపై ఖర్గే మాట్లాడారు. 

రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాజీవితం నుంచి రిటైర్‌మెంట్‌ ఉండదని వ్యాఖ్యానించారు. దేశానికి సేవ చేయాలన్న తపన కలిగిన నాయకులు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎన్నడూ అలసిపోరని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యత్వం ముగు స్తున్న సభ్యులు ప్రజలకు ఎప్పటిలాగే సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని, ఆయనతో కలిసి పనిచేశానని అన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ దేవెగౌడ తమతో డేటింగ్‌ చేసి, ప్రేమాయణం సాగించి, చివరికి మోదీని పెళ్లి చేసుకున్నారు అంటూ చమత్కరించారు. దీంతో సభలో మోదీతో సహా సభ్యులంతా నవ్వులు చిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement