బెంగాల్‌కు కొత్తగా సరుకు రవాణా కారిడార్‌ | Budget 2026–27: West Bengal received major infra allocations | Sakshi
Sakshi News home page

బెంగాల్‌కు కొత్తగా సరుకు రవాణా కారిడార్‌

Feb 2 2026 11:18 AM | Updated on Feb 2 2026 11:29 AM

Budget 2026–27: West Bengal received major infra allocations

పశ్చిమబెంగాల్, గుజరాత్‌ మధ్య వేగవంతమైన సరుకు రవాణా లక్ష్యంగా సరికొత్త కారిడార్‌ను ఆర్థికమంత్రి నిర్మల ఆదివారం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ‘సమీకృత ఈశాన్య భారత పారిశ్రామిక కారిడార్‌’లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని డంకునీ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు నూతన సరుకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. బెంగాల్‌లోని దుర్గాపూర్‌ కేంద్రంగా ఈ కారిడార్‌ను విస్తరిస్తామని చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పర్యాటక పథకమైన ‘పూర్వోదయ విజన్‌’లో భాగంగా మరింత అభివృద్ధి చేస్తామని నిర్మల వెల్లడించారు.

డంకునీ సూరత్‌ ఫ్రీట్‌ కారిడార్‌ అనేది పర్యావరణ అనుకూలమైనదేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఖర్చులనూ భారీగా తగ్గిస్తుందని నిర్మల పేర్కొన్నారు. నదీజల మార్గాల గుండా జరిగే సరకు రవాణాను సమీకృత కారిడార్లతో అనుసంధానించి బెంగాల్‌ పారిశ్రామికాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని నిర్మల తెలిపారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్‌కు మోదీ సర్కార్‌ వరాల జల్లు కురిపించడం గమనార్హం.

పూర్వోదయ రాష్ట్రాలుగా పిలుచుకునే బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఆమె తెలిపారు. 4,000 ఎలక్ట్రిక్‌ బస్సుల అందజేతతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పెంపు, ఆయా రాష్ట్రాల మధ్య జనం, వస్తూత్పత్తుల రవాణాపై దృష్టిపెట్టామని ఆమె వెల్లడించారు.

విమర్శించిన తృణమూల్‌ కాంగ్రెస్‌

రాష్ట్రానికి కొత్తగా సరుకు రవాణా కారిడార్‌ తెస్తామన్న నిర్మల నిర్ణయంపై బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పెదవి విరిచింది. ‘పాత ప్రతిపాదనలకే కొత్త తాయిలాల పొట్లంలో కట్టి ఇస్తున్నారు. నిధుల మంజూరును గాలికొదిలేసి కేవలం కాగితాలకు పరిమితమయ్యే వాగ్దానాలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ఎత్తుగడ. గత ఐదేళ్లుగా ఇదే చూస్తున్నాం.

బెంగాల్‌కు మోదీ సర్కార్‌ కేంద్రనిధులపై శ్వేతపత్రం జారీచేసే దమ్ముందా? 2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్క కూలీకి అయినా ప్రత్యక్ష బదిలీ పథకం(ఈబీటీ) ద్వారా నగదు ఇచ్చినట్లు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు.

ఎన్నికల వ్యూహంగా అభివర్ణించిన విశ్లేషకులు

అభివృద్ధి అని చెబుతున్నా వాస్తవానికి తాజా కేటాయింపులు కేవలం ఎన్నికల ఎత్తు గడగా భావించవచ్చని ఎన్నికల వ్యూహకర్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ భారీ కేటాయింపులు చేస్తోందని వారు వ్యాఖ్యానించారు. ‘‘ ఎన్నికలున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో భారీ వడ్డనలు ఉండటం ఇటీవలికాలంలో ఒక సంప్రదాయంగా మారింది. ఈ కేటాయింపులు వాస్తవాలో కాదో గుర్తెరిగి తదుపరి ఎన్నికల్లో ఓటేసే స్పృహ ఓటర్లకు ఉండాల్సిందే’’ అని చెబుతున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్‌.. భారీ తగ్గుదల!

Advertisement
 
Advertisement
Advertisement