సాగు.. ఫోకస్‌ మిస్‌! | India has launched a multilingual AI tool called Bharat Vistar for farmers | Sakshi
Sakshi News home page

సాగు.. ఫోకస్‌ మిస్‌!

Feb 2 2026 3:11 AM | Updated on Feb 2 2026 10:46 AM

India has launched a multilingual AI tool called Bharat Vistar for farmers

సాగు, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్ల కేటాయింపు 

వ్యవసాయానికి గత ఏడాదికంటే 7 శాతం మాత్రమే పెంపు 

పీఎం–కిసాన్‌కు రూ.63,500 కోట్లు 

రైతుల కోసం ‘భారత్‌–విస్తార్‌’ పేరుతో బహుళ భాషా ఏఐ టూల్‌

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో ఏ విభాగంపై కూడా పెద్దగా ఫోకస్‌ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి పూర్తి నిర్లక్ష్యం చేశారని అఖిల భారత కిసాన్‌ సభ  ఆరోపించింది. 

వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఎటువంటి నిబద్ధతను చూపలేదని ఆక్షేపించారు. అయితే, వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ’సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ అనే దార్శనికతను కనబరిచిందని ఆర్థిక మంత్రి నిర్మలచెప్పారు. సంప్రదాయసాగుపై ఆధారపడటాన్ని తగ్గించి గ్రామీ ణ జీవనోపాధిని వైవిధ్యపరిచేందుకు బడ్జెట్‌ దోహదం చేస్తుందన్నారు.  

కొత్త ఏఐ టూల్‌.. 
» కేంద్రం ‘భారత్‌–విస్తార్‌ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌ టు యాక్సెస్‌ అగ్రికల్చరల్‌ రిసోర్సెస్‌)’ అనే పేరుతో బహుళ భాషా కృత్రిమ మేధ టూల్‌ను ప్రకటించింది. దీనికోసం రూ.150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతులకు సలహాలు అందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టూల్‌ అగ్రిస్టాక్‌ పోర్టల్‌లను, సాగు పద్ధతులపై ఐకార్‌ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానం చేస్తుంది. 
»  పండ్లు, కూరగాయల మిషన్‌ను క్రిష్‌నియోన్నతి యోజన కింద కలిపేసి రూ.700 కోట్లు కేటాయించారు.  
» మఖానా బోర్డు పేరును బిహార్, ఇతర రాష్ట్రాల్లో మఖానా అభివృద్ధి పథకంగా మార్చారు.  దీనికి రూ.90 కోట్లు కేటాయించారు.  
»   పీఎం–కిసాన్‌కు రూ.63,500 కోట్లు కేటాయించారు.  
»  వ్యవసాయ విద్య, పరిశోధనకు 3 శాతం కోతవేసి  రూ. 9,964 కోట్లు కేటాయించారు. 
» ఇన్‌లాండ్‌ ఫిషరీల కోసం 500 రిజర్వాయర్లు, అమృత్‌ సరోవర్లను స్టార్టప్‌లు, మహిళా సంఘాలు, చేపల పెంపకందారుల ద్వారా పటిష్టం చేస్తారు. ప్రధానమంత్రి సంపద యోజనకు కేటాయింపులను రూ.1,500 కోట్ల నుంచి 2,500 కోట్లకు పెంచారు. 
»  కోస్తా, కొండ ప్రాంతాల్లో అధిక వ్యయమయ్యే పంటలైన కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ సాగుకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు.  
»  పేద, సన్నకారు రైతులకు వస్తున్న ఆదాయంలో దాదాపు 16 శాతం పశుసంపద నుంచి వస్తోందంటూ.. 20,000 కంటే ఎక్కువ పశువైద్య నిపుణుల లభ్యతను పెంచడానికి రుణ–సంబంధిత మూలధన సబ్సిడీ పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రైవేట్‌ రంగంలో వెటర్నరీ, పారావెట్‌ (పారా–వెటర్నరీ) కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, బ్రీడింగ్‌ సౌకర్యాల స్థాపనకు తోడ్పడుతుంది. 
»  గత బడ్జెట్‌లో ప్రకటించిన కాటన్‌ టెక్నాలజీ మిషన్, నేషనల్‌ మిషన్‌ ఫర్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌కు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ పథకాలు ఇంకా ప్రారంభంకాలేదు. 

చరిత్రాత్మక బడ్జెట్‌..
అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేసే చరిత్రాత్మక బడ్జెట్‌ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఇది రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. – వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

మ్యాచ్‌ సమ్మరీ
ఈ ఇన్నింగ్స్‌లో వ్యవసాయ రంగానిది విచిత్రమైన పరిస్థితి. బంతి నేరుగా వ్యయసాయ రంగం చేతిలోకి వచ్చింది. కానీ కీపర్‌ చేతిలోకి రాకుండానే జారిపోయింది. అంటే... అన్నీ ఉన్నా కొంచెం ఫోకస్‌ మాత్రం మిస్సయింది. కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పెద్ద షాట్లు వస్తాయని ఆశించిన చోట బంతి జారిపోయింది. అటు బ్యాట్స్‌మన్‌కూ అందలేదు. ఇటు కీపర్‌కూ దొరకలేదు. 

సాగు, అనుబంధ రంగాల కేటాయింపుల్లో స్కోర్‌బోర్డు ముందుకు కదిలినట్టే కనిపించినా, ఫీల్డ్‌లో మాత్రం ఫోకస్‌ తప్పిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఏఐ టూల్స్, పథకాలు ప్రకటించినా రైతులు ఎదురుచూస్తున్న అంశాలకు మాత్రం చోటు దొరకలేదు. వికెట్‌ పడలేదు. కానీ ఫోకస్‌ లేక వ్యవసాయానికి అవకాశం మిస్‌ అయింది. 

డేటా సెంటర్లలో 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
కేంద్ర ప్రభుత్వం అంచనా 
న్యూఢిల్లీ: డేటా సెంటర్లలో 200 బిలియన్‌ డాలర్ల(రూ.18.33 లక్షల కోట్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ కోసం అణు ఇంధనంపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 90 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 70 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. 

భారత్‌లో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాలో డేటా సెంటర్లు సహా ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిజిటల్‌ కనెక్షన్‌ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. డేటా సెంటర్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో 2047 దాకా ట్యాక్స్‌ హాలిడే ప్రకటించింది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రతిపాదిత  ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0తో చిప్‌ల తయారీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.  

క్యాన్సర్‌ బాధితులపై కరుణ
17 రకాల క్యాన్సర్‌ ఔషధాలపై కస్టమ్స్‌ సుంకం రద్దు
అత్యాధునిక చికిత్సలు మరింత మందికి చేరువ 
సాక్షి, అమరావతి: క్యాన్సర్‌ బాధితులకు కేంద్రం భారీ ఆర్థిక ఊరట ఇచ్చింది. క్యాన్సర్‌ చికిత్సల్లో వినియోగించే 17 రకాల ప్రాణాధార ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్‌ ఆధునిక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. టార్గెట్, ఇమ్యునోథెరపీ లాంటి ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. 

విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్‌ మందులపై సాధారణంగా 10% కస్టమ్స్‌ సుంకం ఉంటుంది. తాజాగా దీన్ని మినహాయించనుండటంతో బాధి తులకు ఊరట లభించనుంది. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్‌ కణాలను మాత్రమే వెతికి పట్టుకుని నాశనం చేసే టార్గెటెడ్‌ థెరపీ, రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి క్యాన్సర్‌ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. 

ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండటమే దీనికి కారణం.  ఇక 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే ఔషధాలను కూడా సుంకాల మినహాయింపు జాబితాలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement