నిధుల సిక్సర్‌ | Record breaking allocations for the defense sector | Sakshi
Sakshi News home page

నిధుల సిక్సర్‌

Feb 2 2026 2:49 AM | Updated on Feb 2 2026 7:50 AM

Record breaking allocations for the defense sector

రక్షణ రంగానికి రికార్డు స్థాయిలోరూ.7,84,678 కోట్ల కేటాయింపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌తో పోల్చుకుంటే15 శాతం అధికం 

చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్లపై కేంద్రం దృష్టి 

‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో కొత్త ఆయుధాలు,ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్‌కొనుగోళ్లు లక్ష్యంగా ప్రతిపాదనలు 

మూలధన వ్యయం కోసమే రూ.2,19,306 కోట్లు 

దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే దృఢ సంకల్పానికి ఊతం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 

న్యూఢిల్లీ  :  పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్‌ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రతిపాదించింది. 

అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్‌ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’చరిత్రాత్మక విజయం నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పానికి మూలధన సేకరణ సహా రక్షణ రంగ బడ్జెట్‌ పెంపు మరింత ఊతం ఇచి్చందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. 

రెవెన్యూ వ్యయం రూ.5,53,668 కోట్లు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లతో పోల్చుకుంటే మూలధన వ్యయం రూ.39 వేల కోట్లు పెంచింది. అయితే 2025–26 సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయాన్ని రూ.1,86,454 కోట్లుగా అంచనా వేశారు. తాజా మూలధన వ్యయంలో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.53,733 కోట్లు, నౌకాదళం కోసం రూ.25,023 కోట్లు కేటాయించారు. రూ.1,71,338 కోట్ల పింఛన్లతో కలిపి రెవెన్యూ వ్యయాన్ని రూ.5,53,668 కోట్లుగా చూపించారు.  

కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు 
పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన కాంపొనెంట్లు, విడిభాగాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరిశ్రమలకు.. విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాలింగ్‌కు అవసరమైన విడిభాగాలపై బీసీడీ రద్దును ప్రతిపాదించారు. రక్షణ రంగ వైమానిక పరిశ్రమకు ఈ రెండు నిర్ణయాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. 

పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో అత్యాధునికయుద్ధరీతులపై కేంద్రందృష్టి పెట్టింది.

మాజీ సైనికుల సీహెచ్‌ఎస్‌కు రూ.12,100కోట్లు 
మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ (సీహెచ్‌ఎస్‌) కోసం రూ.12,100 కోట్లు ప్రతిపాదించామని రాజ్‌నాథ్‌ చెప్పారు. భద్రత, అభివృద్ధి, స్వయం సమృద్ధి మధ్య సమతూకాన్ని ఈ బడ్జెట్‌ బలోపేతం చేస్తుందని అన్నారు. 2026–27 నాటికి అంచనా వేస్తున్న జీడీపీలో రక్షణ రంగ బడ్జెట్‌ సుమారు 2 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

మిలటరీ ఆధునీకరణతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, వనరుల సముచిత వినియోగానికి వీలుగా క్రమబద్ధమైన సేకరణపై రక్షణ బడ్జెట్‌ దృష్టి పెడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా సాయుధ దళాల బడ్జెట్‌పై దేశ రక్షణ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ఆధునీకరణ, బలోపేతానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని రక్షణ బడ్జెట్‌ ప్రస్ఫుటం చేసిందని థాలేస్‌ ఇండియా ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అంకుర్‌ కనగ్లేకర్‌ అన్నారు.   

త్రివిధ దళాల ఆధునీకరణే లక్ష్యం: రక్షణ మంత్రి 
త్రివిధ దళాల ఆధునీకరణే ఈ బడ్జెట్‌లో అతి ముఖ్యమైన అంశమనిరాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.85 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 24 శాతం అధికమని పేర్కొన్నారు. ఈ పెంపుదలతో దేశ మిలటరీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రస్తుత బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచి్చనట్లు తెలిపారు.  

మ్యాచ్‌ సమ్మరీ
మిగతా విషయాల్లో ఎంత ‘డిఫెన్స్‌’ ఆడినా... డిఫెన్స్‌ రంగం విషయానికి వచ్చేసరికి నో డిఫెన్స్‌. ఎందుకంటే భద్రతపై రాజీ ఉండకూడదన్నది ప్రభుత్వ పాలసీ. అందుకే... రక్షణ రంగం సేఫ్‌ ప్లేను వదిలి నిధుల సిక్సర్‌ కొట్టింది. రూ.7.84 లక్షల కోట్ల రికార్డు కేటాయింపుతో కేంద్రం బంతిని నేరుగా బౌండరీ దాటించింది. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కొట్టిన ఈ షాట్‌ కేవలం స్కోర్‌ పెంచడానికి కాదు, మ్యాచ్‌ను కంట్రోల్‌లోకి తీసుకురావడానికి. 

మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆధునిక మిలటరీ హార్డ్‌వేర్‌తో దేశ రక్షణ విషయంలో ఎంత హిట్టింగ్‌కైనా సిద్ధమని మోదీ సర్కారు స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత సన్నద్ధతకు మరింత పదునుపెట్టిన ఈ బడ్జెట్‌... డిఫెన్స్‌లో కాదు, అగ్రెసివ్‌ ఫీల్డ్‌ సెటప్‌తో ఆడుతున్న స్పష్టమైన సంకేతం. 

Advertisement
 
Advertisement
Advertisement