కొత్తగా 3 నైపర్‌లు..
వెయ్యి అక్రెడిటెడ్ క్లినికల్ ట్రయిల్ సెంటర్లు
ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్‌లు
3 చోట్ల ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాలు
ఆరోగ్యానికి రూ.1,06,530.42 కోట్లు
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో సదుపాయాలను విస్తరించడం, వైద్య విద్య, ఫార్మా రంగాలకు ప్రోత్సాహం, హెల్త్‌కేర్‌లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడం లక్ష్యంగా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పది శాతం పెంపుతో రూ.1,06,530.42 కోట్లను ఆరోగ్యశాఖకు కేటాయించారు. ఆధునిక చికిత్సలతో బయో ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ‘బయో ఫార్మా శక్తి’ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేయనున్నారు.
దేశం బయో ఫార్మా తయారీ హబ్‌గా ఎదిగి దిగుమతులపై ఆధార పడాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. కొత్తగా మూడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న 7 నైపర్‌లను ఆధునీకరిస్తారు. వెయ్యి అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు రూ.4,000 కోట్లు కేటాయించారు.
నేషనల్ ఎయిడ్స్, లైంగిక సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి రూ.3,477 కోట్లు వ్యయం చేయనున్నారు. రాంచి, తేజ్‌పూర్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఉత్తరాదిలో ‘నిమ్‌హాన్స్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య రంగంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు రూ.350 కోట్లు కేటాయించారు.
ప్రమాదాల సమయంలో వేగంగా అత్యవసర వైద్య సదుపాయాలు అందేలా ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య, వైద్య విద్య రంగంలో సిబ్బంది, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, వైద్య విద్య సీట్ల అప్‌గ్రెడేషన్, నర్సింగ్ విద్య తదితరాల కోసం రూ.1,725 కోట్లు కేటాయించారు. దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, జీవన శైలి జబ్బుల చికిత్స భారం, నైపుణ్యం కలిగిన హెల్త్‌కేర్ నిపుణులకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ విద్య విస్తరణ, బలోపేతం కోసం మూడేళ్లలో రూ.980 కోట్లు వ్యయం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.
దీని ద్వారా 10 కీలక విభాగాల్లో హెల్త్ ప్రొఫెషనల్ అనుబంధ ఇన్‌స్టిట్యూట్లను నెలకొల్పి ఐదేళ్లలో లక్ష మంది నిపుణులైన ప్రొఫెషనల్స్‌ను సిద్ధం చేస్తారు. వృద్ధుల జనాభాకు అనుగుణంగా 1.5 లక్షల మంది కేర్ టేకర్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. దేశంలో ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్‌ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆయుష్, ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆస్పత్రులు, అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, పునరావాసం, వైద్య విద్య , పరిశోధన సౌకర్యాలతో ఇవి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాలు 3 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రధాని స్వాస్థ సురక్ష యోజన రూ.11,307 కోట్లు
ఎన్‌హెచ్‌ఎం రూ.39,390 కోట్లు
పీఎం –జేఏవై రూ.9,500 కోట్లు
పీఎం – ఏబీహెచ్‌ఐఎం రూ.4770 కోట్లు
ఢిల్లీ ఎయిమ్స్ రూ.5500.92 కోట్లు
సీజీహెచ్‌ఎస్ పెన్షనర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ పథకానికి రూ.8697.86 కోట్లు
కేంద్ర ఆస్పత్రులకు రూ.4599.66 కోట్లు
హెల్త్ రీసెర్చ్ విభాగానికి రూ.4,821.21 కోట్లు (డీహెచ్‌ఆర్)
సురక్షితమైన రక్త మార్పిడి సేవలకు రూ.275 కోట్లు


