2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
డేటా సెంటర్లకు ప్రోత్సాహంగా ట్యాక్స్ హాలిడే
దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం 3 కర్తవ్యాల ప్రకటన
తయారీ రంగ సామర్థ్యం పెంపునకు కీలక చర్యలు
విదేశాల నుంచి మరింత మూలధనాన్ని ఆకర్షించే మంత్రం
ప్రపంచ స్థాయికి దేశీయ ఉత్పాదక రంగం ఎదిగేలా ప్రణాళిక
న్యూఢిల్లీ: సామాన్యుడికి కొంత మోదం.. స్టాక్ మార్కెట్లకు, మదుపర్లకు ఖేదం.. స్టార్టప్‌లకు కాస్త నిరాశ.. పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి.. విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తయారీరంగం వారికి ఊరట.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బడ్జెట్ క్రికెట్ మ్యాచ్ చూశాక.. వివిధ వర్గాల అనుభూతులివి. 2026–27 సంవత్సరానికిగానూ రూ.53.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్మల ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ, ప్రజాకర్షక హామీలకు దూరంగా బడ్జెట్‌ను రూపొందించారు. విత్త మంత్రి తన బడ్జెట్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు ప్రకటించారు.
యువశక్తి బడ్జెట్
మాఘ పౌర్ణమి శుభ పర్వదినాన, సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు రవిదాస్ జయంతి రోజున 2026–27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు నిర్మల తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ 12 ఏళ్లలో ఆర్థిక రంగానికి స్థిరత్వం వచ్చిందని, సుస్థిరాభివృద్ధి, ద్రవ్య క్రమశిక్షణ సాధ్యమయ్యాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజాకర్షక హామీలకంటే ప్రజల ప్రయోజనాలను నిరంతరం ఎంచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. దీన్ని ‘యువ శక్తి నడిపిన బడ్జెట్’గా ఆమె అభివర్ణించారు.
3 కర్తవ్యాలు
విత్తమంత్రి తన ప్రసంగాన్ని మూడు ప్రధాన కర్తవ్యాలతో ప్రారంభించారు. అవి సమ్మిళిత వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరితో కలసి–అందరి ప్రగతి. జీఎస్టీ సరళీకరణ, లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వంటి 350కిపైగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మొదటి కర్తవ్యం కింద 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించారు. కీలక రంగాల్లో తయారీని భారీగా పెంచడం, ‘చాంపియన్ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)’ తయారుచేయడం, మౌలిక వసతుల రంగానికి ఊపునివ్వడం, ఇంధనరంగంలో సుస్థిరాభివృద్ధి – దీర్ఘకాలిక భద్రతకు చర్యలు, పట్టణ ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి.
కస్టమ్స్ పన్నుల్లో సరళీకరణ
2026–27 బడ్జెట్‌లో కస్టమ్స్ విధానాన్ని సరళీకరించారు. అనవసర మినహాయింపులను తగ్గించారు. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేశారు. ప్రయాణికుల బ్యాగేజ్ నిబంధనలను సడలించి, వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి తగ్గించారు.
‘ఇంద్రధనుస్సు’ తయారీ
ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, టెక్స్‌టైల్స్, క్రీడా పరికరాలు వంటి ఏడు రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగాల సృష్టి, సాంకేతికత ఆధారిత అభివృద్ధిపై దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
పర్యాటకం – చిరు వ్యాపారాలు
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలో పర్యావరణ హిత పర్వత మార్గాల అభివృద్ధికి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 పురావస్తు కేంద్రాల అభివృద్ధికి కూడా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
డేటా సెంటర్లు, స్టాక్ మార్కెట్
మనదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటుచేసే సంస్థలకు నిర్మలమ్మ పెద్ద శుభవార్తే చెప్పారు. భారతదేశం నుంచి గ్లోబల్ డేటా సెంటర్ సేవలు అందించే సంస్థలకు ఏకంగా 20 ఏళ్ల పాటు.. అంటే 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధించారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచుతున్నట్టు ప్రకటించారు.
విదేశీ టూర్లు – విదేశీ విద్య
విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గించారు. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై కూడా టీసీఎస్ తగ్గింపు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. విద్యార్థులు, యువ ఉద్యోగులు, టెక్ ఉద్యోగులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎన్నారైలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, 6 నెలల పాటు అమల్లో ఉండే విదేశీ ఆస్తుల వెల్లడింపు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.
విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త
ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు, విదేశాల నుంచి మరింత మూలధనాన్ని ఆకర్షించేందుకు నిర్మల మూడు కీలక అంశాలు ప్రకటించారు. కార్పొరేట్ బాండ్లకు మార్కెట్ – మేకింగ్ ఫ్రేమ్‌వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి వినూత్న మార్గం, లిస్టెడ్ కంపెనీల్లో అలాంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులు పెంచడం వంటి నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (పీఐఎస్) ద్వారా ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు భారతీయ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
మౌలిక వసతులు
మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కలిపే ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభిస్తారు. తీర ప్రాంత సరుకు రవాణాను ప్రోత్సహించే పథకాన్ని కూడా అమలు చేస్తారు. సీప్లేన్ ల తయారీ దేశీయంగా జరిగేలా ప్రోత్సాహకాలు ఇస్తారు.
క్లీన్ ఎనర్జీ
స్వచ్ఛ ఇంధన రంగంలో భాగంగా, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగించే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సాంకేతికతల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20,000 కోట్ల వ్యయం ప్రకటించారు. పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు, నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ‘వృద్ధి అనుసంధానాలుగా’ అభివృద్ధి చేయనున్నారు. లిథియం–అయాన్ బ్యాటరీలు, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన దిగుమతులపై కూడా డ్యూటీ మినహాయింపు కొనసాగుతుందని ప్రకటించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటుచేయనున్నారు.
దివ్యాంగులకు వరాలు
దివ్యాంగులకు చేయూతకోసం ‘దివ్యాంగజన్ కౌశల్ యోజన’, ‘దివ్యాంగ్ సహకార యోజన’ వంటి పథకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ ప్రజా రవాణా ప్రోత్సహించేందుకు 4వేల విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇంకా, 7 అరుదైన వ్యాధులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలను వ్యక్తిగత వినియోగం కోసం డ్యూటీ లేకుండా దిగుమతికి అనుమతి ఇచ్చారు.
ప్రపంచ స్థాయికి ఉత్పాదక రంగం
దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మల అనేక పథకాలు ప్రకటించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’, ఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల విడి భాగాల తయారీ ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటా పెంచేందుకు రూ.10వేల కోట్లతో కంటైనర్ తయారీ పథకం ప్రకటించారు.
సాగు – బ్యాంకింగ్ – క్రీడలు
వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం వంటి చర్యలు ప్రకటించారు. బ్యాంకింగ్ రంగం మీద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఖేలో ఇండియా మిషన్‌కు శ్రీకారం చుడుతున్నట్టు నిర్మల తెలిపారు.


