కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ప్రపంచ స్థాయి ‘ఛాంపియన్స్’గా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వినూత్నమైన మూడంచెల వ్యూహాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈక్విటీ, లిక్విడిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
దేశంలోని ఎంఎస్‌ఎంఈలు కేవలం చిన్న సంస్థలుగానే మిగిలిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఛాంపియన్లుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు.
పెట్టుబడి మద్దతు
ఎంఎస్‌ఎంఈలకు రుణ భారంతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. భవిష్యత్తులో దిగ్గజ సంస్థలుగా ఎదిగే అవకాశం ఉన్న ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక ‘ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. 2021లో ప్రారంభించిన ‘సెల్ఫ్-రిలయంట్ ఇండియా ఫండ్’కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించి మైక్రో ఎంటర్‌ప్రైజెస్ రిస్క్ క్యాపిటల్‌ను పొందేలా చర్యలు తీసుకున్నారు.
లిక్విడిటీ సపోర్ట్
చిన్న పరిశ్రమలకు చెల్లింపుల సమస్య లేకుండా ఉండేందుకు TReDS (Trade Receivables Discounting System) ప్లాట్‌ఫారమ్‌ను మరింత శక్తివంతం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులను తప్పనిసరిగా TReDS ద్వారానే జరపాలి. ఇది కార్పొరేట్ రంగానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. TReDS ప్లాట్‌ఫారమ్‌పై ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కోసం క్రెడిట్ గ్యారెంటీ మద్దతును ప్రభుత్వం కల్పిస్తుంది.
‘జెమ్స్’తో అనుసంధానం: ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జెమ్స్)ను TReDSతో అనుసంధానించడం ద్వారా వేగంగా తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ పొందే వెసులుబాటు కలుగుతుంది.
ప్రొఫెషనల్ సపోర్ట్
చిన్న సంస్థలు చట్టపరమైన నిబంధనలను తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు ‘ప్రొఫెషనల్ సపోర్ట్’ అందించనున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ‘కార్పొరేట్ మిత్ర’లను అభివృద్ధి చేస్తారు. ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్పొరేట్ మిత్రలకు శిక్షణ ఇచ్చి ఎంఎస్‌ఎంఈలకు సరసమైన ధరలకే సేవలు అందేలా ప్రభుత్వం సహకరిస్తుంది.
కొరియర్ ఎగుమతులపై పరిమితి ఎత్తివేత
ఎంఎస్‌ఎంఈ రంగం ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యేలా చేసేందుకు పన్ను ప్రతిపాదనల్లో కీలక మార్పు చేశారు. ప్రస్తుతం కొరియర్ ద్వారా చేసే ఎగుమతులపై ఉన్న రూ.10 లక్షల గరిష్ట విలువ పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ఈ-కామర్స్ ద్వారా విదేశాలకు వస్తువులను పంపే చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్‌డేట్స్


