గతేడాదితో పోలిస్తే పెరిగిన పన్నులు రూ.3,281.01 కోట్లు
హైదరాబాద్ మీదుగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు
సింగరేణికి రూ.2,500 కోట్లు కేటాయించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన నిధుల కేటాయింపులు, పన్నుల వాటా వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలో స్వల్ప పెరుగుదల కనిపించగా, మౌలిక వసతుల కల్పనలో భాగంగా హైదరాబాద్‌కు మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రతిపాదించడం గమనార్హం. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా కింద ఈసారి తెలంగాణకు 2.174 శాతం ఖరారైంది.
దీని ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ పన్ను రూ.9,740.28 కోట్లు, ఆదాయపు పన్ను రూ.11,808.15 కోట్లు, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.9,074.92 కోట్లు, కస్టమ్స్ సుంకం రూ.1,770.30 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.754.15 కోట్లు, ఇతర ట్యాక్స్‌లు రూ.32.98 కోట్లు ఉన్నాయి. కాగా గత బడ్జెట్‌లో కేంద్రం పన్నుల రూపంలో తెలంగాణకు రూ.29,899.77 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి వస్తున్న పన్నుల నిధులు రూ.3,281.01 కోట్లు అధికం.
హైదరాబాద్‌కు మూడు ‘హైస్పీడ్’మార్గాలు
దేశవ్యాప్తంగా నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్రం ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ను అనుసంధానించనున్నాయి. ఇది రాష్ట్ర రవాణా రంగానికి ఊతమిచ్చే అంశం. ఈ కారిడార్లలో పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నైలు ఉన్నాయి.
పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల బదిలీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ‘ఎస్‌ఎన్‌ఏ స్పర్‡్ష’మాడ్యూల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు.. కేవలం ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో తెలంగాణ చోటు దక్కించుకుంది.
జీఎస్టీ పరిహారం లెక్కలు ఇవీ..
జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు, గతంలో కేంద్రం ‘బ్యాక్ టు బ్యాక్ లోన్’పద్ధతిలో నిధులు విడుదల చేసింది. దీని కింద తెలంగాణకు 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మొత్తం రూ.6,949.49 కోట్లు విడుదలైనట్టు తాజా బడ్జెట్ పత్రాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకు కేటాయింపులు ఇవే
ఈ బడ్జెట్‌లో ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజనలో భాగంగా తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ సహా ఇతర ఎయిమ్స్‌లు అన్నింటికి కలిపి రూ.2,005 కోట్లు కేంద్రం కేటాయించింది. హైదరాబాద్ ఐఐటీ (ఎక్సట్రనల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపించారు. కాగా తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయింపులు ప్రత్యేకంగా చేయలేదు.
సింగరేణికి పెరిగిన నిధుల కేటాయింపు
సింగరేణి కేలరీస్ సంస్థకు రూ.2,500 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.405.97 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి గత బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించి, రూ.281.07 కోట్లకు సవరించారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో నిధుల కోత విధించి రూ.215 కోట్లు ఏడు నైపర్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
కాగా హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.30 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.26 కోట్లు, హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ.280 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డుకు రూ.14.55 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు, నిజాం సంస్థాన విలీనం కోసం పోరాడిన యోధులకు (పెన్షన్లు) రూ.589.97 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు కేటాయింపుల్లో కోత విధించి రూ.908.78 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు.
అయితే హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. మూడేళ్ల క్రితం రూ.115 కోట్లు కేటాయించి, రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో కేవలం రూ.10.84 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం....గత బడ్జెట్‌లో కేవలం నామమాత్రంగా రూ.0.01 కోట్లు కేటాయించింది. కాగా ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) సహా దేశంలోని 25 స్వయంప్రతిపత్తి కేంద్రాలన్నింటికీ కలిపి రూ.1,643.87 కోట్లు, సీడీఎఫ్‌డీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ.1,002.13 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ.1,745.52 కోట్లు కేటాయించారు.


