సాక్షి,హైదరాబాద్: సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదని.. సిట్ అంటే సీఎం ‘సీఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై నందినగర్ నివాసంలో కేసీఆర్‌ను సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ సిట్ విచారణపై హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో..సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం,రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉంది. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారు. నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదు.
కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌక బారు రాజకీయానికి నిదర్శనం. పదేళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించి తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరం.
పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అయ్యింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం.
చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. సిట్ అంటే సిట్ కాదు. ఇది CIT సిట్..‘సీఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్’. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారు పోలీసులు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదు, సీఎం కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకే పని చేస్తోంది. సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.
మీరు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కావు మీరు అనుసరించిన విధానం రాజ్యాంగం బద్దం కాదు. అయినా సరే.. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కెసిఆర్ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అధికారం మదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పరిపాలనా చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నా.. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నట్లు?. మా నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు, అదుపులోకి తీసుకున్నారు.
గజ్వేల్ నుండి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులను మోహరించారు. బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. రెండేళ్లుగా చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదు అందుకే రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నడు. దర్యాప్తు పేరు చెప్పి ముందే తీర్పు రాయడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు. ఇది కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ మోడల్ రైతుల కష్టాలు పట్టవు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, అవ్వా తాతలకు పింఛన్లు పెంచరు. ఆరు గ్యారెంటీల అమలు చేయరు కానీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భయపడే ప్రభుత్వాలే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తాయి. చరిత్ర సృష్టించిన నాయకుడిని,కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ. చరిత్రను చెరిపేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరు’ అని పేర్కొన్నారు.


