సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు..
ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులతో కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు..
ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్ స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నందినగర్ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ కీలక నేతలను గంటల తరబడి సిట్ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్‌ఎస్ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


