మేడారం(ములుగు జిల్లా): మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో మా ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే ఆదివాసి బిడ్డనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తాను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాల చేశాయని, సీతక్క పారిపోయే రకం కాదన్నారు. భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకం తానన్నారు. మేడారంలో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ‘తనువెల్ల ఆదివాసి అస్తిత్వాన్ని, నిలువెల్లా ఆత్మగౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నేను. మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడే రకం కాదు
జాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నాం. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బంది నియమించి మేడారాన్నీ పరిశుభ్రపరుస్తున్నాము. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు. విఐపిల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయింది
ఆ ట్రాఫిక్ జామ్ లో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. గట్టమ దేవాలయం వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకున్నాము. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సమ్మక్కకు రావటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నివారించాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ దఫా నివారించగలిగాము. భక్తితో బాధ్యతతో సంయమనంతో దైవ దర్శనానికి రండి అని భక్తులకు మేము చేసిన విజ్ఞప్తి పనిచేసింది
బ్రహ్మాండంగా జాతరను నిర్వహించుకున్నాము. అందరికీ అభినందనలు. సమ్మక్క సారలమ్మతో మాకు భావోద్వేగా బంధం ఉంది అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టాము. గుడి నిర్మాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాము. గుడి నిర్మాణం జాతరకు ముందే పూర్తయింది. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి రెండు లక్షల మంది భక్తులే వచ్చేవారు. కానీ కొత్త గుడి నిర్మాణం తర్వాత ఓకే రోజూ 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. గతంలో తాత్కాలికంగా పనులు జరిగేవి కానీ ఈ దఫా శాశ్వత పద్ధతిలో పనులు పూర్తి చేయడం వల్ల భక్తులు విపరీతంగా తరలివచ్చారు. త్రాగునీరు టాయిలెట్స్ ముందస్తుగానే సిద్ధం చేశాం. సమ్మక్కను సకాలంలో గద్దెల మీదకు తీసుకురావడంలో పూజారులు సహకరించారు.. వారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు’ అని పేర్కొన్నారు.


