ఏప్రిల్1 నుంచి కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ చట్టం అమల్లోకి..
ఎన్నారైలపై పలు వరాలుకురిపించిన నిర్మలమ్మ
ఎన్నారైల విద్య, మెడిక్లెయింలపై టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి తగ్గింపు
విదేశీ ఆస్తులు ప్రకటించని రూ.20 లక్షలలోపు విలువ వరకు జరిమానా ఎత్తివేత
విదేశీ పర్యాటక ప్యాకేజీలపై విధించే టీసీఎస్20 శాతం నుంచి రెండు శాతానికి తగ్గింపు
మానవ వనరులు అందించే సంస్థలపైటీడీఎస్ ఒకటి లేదా రెండు శాతానికి పరిమితం
బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
సాక్షి, అమరావతి : ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్, టీసీఎస్‌ల భారం తగ్గించడంతోపాటు వ్యక్తిగత ట్యాక్స్ రిటర్నులు ఏడాదంతా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. విదేశాల్లో ఉన్న ప్రకటించని ఆస్తులను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ప్రకటించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆదివారం నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు...
» ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్– 2025 చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఇచ్చే ట్యాక్స్ రిబేట్, రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పరిగణనలోకి తీసు కుంటే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.
» వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్–1, ఐటీఆర్–2కింద రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31, అదే ఆడిట్ అవసరం లేని సంస్థలకు గడువు తేదీ ఆగస్టు 31.
» దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేసుకోవడానికి ప్రస్తుతం డిసెంబర్ 31గా ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగించారు.
» విదేశీ టూర్ ప్యాకేజీలపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం , 20 శాతం టీసీఎస్‌ను రెండు శాతానికి తగ్గించారు.
» మానవ వనరులు అందించే సంస్థలపై విధించే టీడీఎస్‌ను ఒకటి లేదా రెండు శాతానికి పరిమితం చేశారు.
» విదేశీ ఆస్తులను ప్రకటించడానికి వన్‌టైమ్ డిస్‌క్లోజర్ స్కీంను ప్రవేశపెట్టారు
» గత రిటర్నుల్లో విదేశీ ఆస్తులను ప్రకటించడంలో విఫలమైతే ఈ స్కీం కింద తక్కువ పెనాల్టీతో ప్రకటించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
» ఆస్తి విలువ రూ.20 లక్షల లోపు ఉంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. అదే కోటి రూపాయల లోపు ఉంటే మార్కెట్ విలువలో 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
» ప్రవాస భారతీయులు పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీం(పీఐఎస్) కింద పెయిడప్ క్యాపిటల్‌లో 10 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు.ఇప్పటిదాకా ఇది 5 శాతంగానే ఉండేది. స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల్లో వీరు ఇక నుంచి 24 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది 10 శాతంగా ఉండేది.
» కార్పొరేట్స్‌పై విధిస్తున్న మినిమమ్‌ఆల్టర్నేటివ్ ట్యాక్స్‌ను (మ్యాట్) 15 నుంచి 14 శాతానికి తగ్గించారు.
» ఆర్‌బీఐ నుంచి నేరుగా సావరిన్‌గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు... కాలపరిమితి ముగిసేంత వరకూ తమ వద్దఉంచుకుంటే, వాళ్లకు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవే బాండ్లను సెంకడరీ మార్కెట్ నుంచికొనుగోలు చేసిన వారు మాత్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మ్యాచ్ సమ్మరీ
పిచ్ మారలేదు. ఫీల్డ్ సెట్టింగ్ కూడా మునుపట్లానే. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబులు యథాతథం. కాకపోతే అంపైర్ నుంచి అనుకోకుండా నోబాల్ వచ్చింది. అంటే... ఓ సింగిల్ రన్‌తో పాటు మరో బాల్ అదనమన్న మాట. టీడీఎస్, టీసీఎస్‌లను తగ్గించటం సింగిల్ రన్ అదనంగా లభించటమే. అదనపు బాల్, సింగిల్ రన్ కాంబినేషన్‌తో కొంతయినా రన్‌రేట్‌పై ఒత్తిడి తగ్గింది. ఎన్నారైలకైతే లూజ్ డెలివరీలు పడ్డాయి. విదేశీ ఆస్తులపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఫ్రీ హిట్‌లాగామారింది. బౌండరీలు లేవు, హిట్టింగ్ లేదు. కానీ వికెట్లు కాపాడుకుంటూ స్కోర్‌బోర్డు ముందుకు నడిపిన ఒక క్లాసిక్ కన్సాలిడేషన్ ఓవర్ ఇది.


