భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులు, అస్థిరమైన మార్కెట్ ధరల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026)లో వ్యవసాయాన్ని లాభసాటిగా, సుస్థిరంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి సాంకేతికతతో కూడిన ‘స్మార్ట్ అగ్రికల్చర్’ వైపు అడుగులు వేయడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాతావరణానికి అనువైన వ్యవసాయం
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం స్థితిస్థాపక వ్యవసాయంపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంలో కింది అంశాలను పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
కరువును, వరదలను తట్టుకునే అత్యధిక నాణ్యత గల విత్తనాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు నిధులు పెంచడం.
నీటి యాజమాన్యంలో భాగంగా సూక్ష్మ సేద్యం, భూసార పరిరక్షణ కోసం రైతులకు సబ్సిడీలు అందించడం.
రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని కాపాడటం.
పీపీపీ మోడల్‌తో మౌలిక సదుపాయాలు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట నష్టాన్ని తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పెట్టుబడులతో అధునాతన కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల నిర్మించాలని వ్యవసాయ సంఘాలు చెబుతున్నాయి. రైతుల నుంచి నేరుగా మార్కెట్‌కు పంటను తరలించేలా రవాణా నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న అధునాతన యంత్రాలను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేస్తే మరింత ఉత్పాదకత సాధ్యం అవుతుంది.
అధిక విలువ కలిగిన పంటలు
వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే హార్టికల్చర్ (ఉద్యానవన పంటలు)పై బడ్జెట్ దృష్టి సారించాలి. తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పండ్లు, ఔషధ మొక్కల సాగుకు ప్రోత్సాహకాలు అందించాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
రైతన్నకు ‘స్మార్ట్’ అండ
సాంకేతికతను సామాన్య రైతుకు చేరువ చేయడమే డిజిటల్ ఇంటిగ్రేషన్ లక్ష్యం. మొబైల్ యాప్‌ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నివారణా చర్యలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ డేటాతో అనుసందానించి అందించాలి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించేలా ‘ఈ-నామ్’ (e-NAM) వంటి ప్లాట్‌ఫామ్‌లను మరింత బలోపేతం చేయాలి. పంటల అంచనా, రుణాల మంజూరు సులభతరం చేసేందుకు వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలి.
సుస్థిర సాగు, ప్రైవేటు పెట్టుబడులు, డిజిటల్ విప్లవంతో కూడిన వ్యూహం అమలులోకి వస్తే భారత వ్యవసాయ రంగం మరిన్ని ఫలితాలు సాధిస్తుంది. బడ్జెట్ 2026లో చేసే కేటాయింపులు అన్నదాతకు భరోసా కల్పించడమే కాకుండా దేశ ఆహార భద్రతను మరింత పటిష్టం చేస్తాయని ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు


