భారీ సబ్సిడీ స్కీమ్‌.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు! | Donkey Farming Government Offering Rs 50 Lakh Support | Sakshi
Sakshi News home page

భారీ సబ్సిడీ స్కీమ్‌.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!

Mar 6 2026 12:25 PM | Updated on Mar 6 2026 5:20 PM

Donkey Farming Government Offering Rs 50 Lakh Support

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 లక్షల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది.

సగం సబ్సిడీ
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు వ్యయంపై 50 శాతం వరకు మూలధన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు.

అర్హులెవరు?
ఈ పథకానికి వ్యక్తిగత రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG), సహకార సంఘాలు, సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్ని గాడిదలు ఉండాలంటే..
గాడిదల పెంపక యూనిట్‌కు అర్హత పొందాలంటే కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలతో ప్రాజెక్టు ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది.

సబ్సిడీ విడుదల ఇలా..
ఈ సబ్సిడీని రెండు విడతలుగా విడుదల చేస్తారు. ప్రాజెక్టుకు బ్యాంకు రుణం ఆమోదం పొందిన తర్వాత మొదటి విడతను విడుదల చేస్తారు. అనంతరం గాడిదల పెంపక కేంద్రం పూర్తయి, అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీని అందిస్తారు.

దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019లో జరిగిన 20వ పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు.

ఒకప్పుడు గ్రామీణ రవాణా, నిర్మాణ పనుల్లో విస్తృతంగా ఉపయోగించిన గాడిదలకు యాంత్రీకరణ పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement