న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో అత్యంత రిస్కీ ప్రాంతాల నుంచి వెళ్లే నౌకలకు యుద్ధ రిస్కుల కవరేజీకి సంబంధించి మరింత ఎక్కువగా ప్రీమియం చెల్లించాల్సి రానుందని నిపుణులు తెలిపారు. క్రూడాయిల్, ద్రవీకృత సహజ వాయువును రవాణా చేసే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) నౌకలు, ముఖ్యంగా ఎర్ర సముద్రం ప్రాంతం గుండా వెళ్లేవి, ఇంకా అధికంగా చెల్లించాల్సి రావచ్చని పాలసీబజార్ హెడ్ (మెరైన్ ఇన్సూరెన్స్) ఆర్. బాలసుందరం తెలిపారు.
ఇలాంటి పరిణామాలతో సమీప భవిష్యత్తులో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలతో మెరైన్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి వార్ రిస్క్ కవరేజీని బీమా సంస్థలు ఉపసంహరించాయని ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) నిపుణుడు హరి రాధాకృష్ణన్ తెలిపారు. సాధారణంగా మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీల కింద యుద్ధం, సమ్మెలు, అల్లర్లు మొదలైనవాటికి సంబంధించిన కవరేజీ రద్దుకు మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు నోటీసు పీరియడ్ ఉంటుందని పేర్కొన్నారు.
ఒకసారి రద్దయితే, తాజాగా రిస్క్ కవరేజీ దొరక్కపోవచ్చని, ఒకవేళ లభించినా భరించలేనంత స్థాయిలో ప్రీమియంలు ఉంటాయని రాధాకృష్ణన్ చెప్పారు. మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలు 0.25 శాతం–0.50 శాతం నుంచి ఒక్క శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోందని తెలిపారు. దీనితో షిప్పింగ్ వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని, అంతర్జాతీయంగా వాణిజ్య వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇజ్రాయెల్ తరహాలో ప్రభుత్వాల నుంచి రీఇన్సూరెన్స్‌పరమైన దన్ను అవసరమవుతుందని రాధాకృష్ణన్ తెలిపారు.
యుద్ధంతో సవాళ్లు తీవ్ర స్థాయిలో పెరిగితే రిస్కు స్థాయిని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు సత్వరం ప్రీమియంలను మార్చే అవకాశం ఉందని ప్రూడెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ హెడ్ (మెరైన్ స్పెషాలిటీస్) గౌరవ్ అగర్వాల్ చెప్పారు. కార్గో విలువపై ప్రీమియంను లెక్కిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో కార్గో రేటు మారకపోయినా, ప్రీమియం మాత్రం పెరగొచ్చని వివరించారు. అయితే, ఉద్రిక్తతలు భారీగా విస్తరిస్తే తప్ప బీమా ప్రీమియంలు విస్తృత స్థాయిలో పెరగకపోవచ్చని పేర్కొన్నారు.


