పెరిగిన కరెంట్‌ ఖాతా లోటు | India Current Account Deficit Widens to Export Slump and Rising Imports | Sakshi
Sakshi News home page

పెరిగిన కరెంట్‌ ఖాతా లోటు

Mar 6 2026 8:49 AM | Updated on Mar 6 2026 9:19 AM

India Current Account Deficit Widens to Export Slump and Rising Imports

కరెంటు ఖాతా లోటు డిసెంబర్‌ త్రైమాసికంలో 13.2 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 11.3 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. అమెరికాకు ఎగుమతులు క్షీణించడం, దిగుమతులు పెరిగిపోవడంతో ఏర్పడిన వాణిజ్య లోటు ఇందుకు దారితీసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య (మూడు త్రైమాసికాలు) కరెంటు ఖాతా లోటు 30.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. జీడీపీలో ఇది 1 శాతానికి సమానం. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ చివరికి 36.6 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.3 శాతం)గా ఉంది. ఈ మేరకు బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ వివరాలను ఆర్‌బీఐ విడుదల చేసింది.  

  • వస్తు వాణిజ్య లోటు డిసెంబర్‌ త్రైమాసికంలో 93.6 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 79.3 బిలియన్‌ డాలర్లుగానే ఉంది.

  • సేవల దిగుమతులు 51.2 బిలియన్‌ డాలర్ల నుంచి 57.5 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రూ.3.7 బిలియన్‌ డాలర్ల మేర డిసెంబర్‌ క్వార్టర్‌లో వెనక్కి వెళ్లాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2.8 బిలియన్‌ డాలర్లు వెనక్కి మళ్లడం గమనార్హం.

  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఫీఐ) 0.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను భారత్‌ నుంచి నికరంగా ఉపసంహరించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉపసంహరణ 11.4 బిలియన్‌ డాలర్లతో పోలి్చతే గణనీయంగా తగ్గింది.  

  • ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు నికరంగా 5.1 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. అలాగే, ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ (ఈసీబీలు) రూపంలో 3.3 బిలియన్‌ డాలర్ల నిధులు దేశీ సంస్థలకు అందాయి.

  • విదేశీ మారకం నిల్వలు 24.4 బిలియన్‌ డాలర్ల మేర డిసెంబర్‌ త్రైమాసికంలో తగ్గాయి.  

  • ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి ఎఫ్‌డీఐ నికరంగా 3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు మాత్రం 4.3 బిలియన్‌ డాలర్లు బయటకు వెళ్లిపోయాయి. విదేశీ మారకం నిల్వలు ఈ కాలంలో 30.8 బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement