అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ వెనకబడింది. 2025 డిసెంబరు నాటికి భారత్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందని యూరోపియన్ థింక్ ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’(CREA) తన తాజా నివేదికలో వెల్లడించింది.
గణాంకాలు ఇలా..
సీఆర్‌ఈఏ డేటా ప్రకారం, నవంబర్ నెలలో 3.3 బిలియన్ యూరోలుగా ఉన్న భారత రష్యన్ హైడ్రోకార్బన్ల దిగుమతులు డిసెంబరు నాటికి 2.3 బిలియన్ యూరోలకు తగ్గాయి. ఇదే సమయంలో టర్కీ 2.6 బిలియన్ యూరోల కొనుగోళ్లతో రెండో స్థానానికి చేరగా, చైనా 6 బిలియన్ యూరోల వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
డిసెంబరులో భారత్ దిగుమతుల వివరాలు
ముడి చమురు: 1.8 బిలియన్ యూరోలు (మొత్తం దిగుమతుల్లో 78%)
బొగ్గు: 424 మిలియన్ యూరోలు
చమురు ఉత్పత్తులు: 82 మిలియన్ యూరోలు
తగ్గుదలకు ప్రధాన కారణాలు
అమెరికా ఆంక్షల సెగ: ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా నిధులను అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికాకు చెందిన ‘ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్’ (OFAC) చర్యలు చేపట్టింది. దాంతో రష్యాకు చెందిన ప్రధాన చమురు సంస్థలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల భయంతో భారతీయ కంపెనీలు వెనక్కి తగ్గాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యూహాత్మక నిర్ణయం: భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (జామ్ నగర్), రష్యన్ ముడి చమురు వినియోగాన్ని ఏకంగా సగానికి (50%) తగ్గించింది. గతంలో రోస్ నెఫ్ట్ ద్వారా సరఫరా అయిన కార్గోలను మాత్రమే తీసుకున్న రిలయన్స్, కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇతర మార్గాలను వెతుక్కుంటోంది.
ప్రభుత్వ రంగ సంస్థల కోత: ప్రైవేట్ సంస్థలే కాకుండా, ప్రభుత్వ రంగ రిఫైనర్లు కూడా రష్యా నుంచి దిగుమతులను 15 శాతం వరకు తగ్గించుకున్నాయి. హెచ్‌పీసీఎల్(HPCL), మంగళూరు రిఫైనరీ (MRPL) వంటి సంస్థలు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) మాత్రం ఆంక్షలు లేని సంస్థల నుంచి మాత్రమే పరిమితంగా దిగుమతులు చేస్తోంది.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకే చమురు లభించడంతో భారత్ ఒక దశలో 35 శాతం వరకు రష్యాపైనే ఆధారపడింది. కానీ, ప్రస్తుత అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆంక్షల కారణంగా ఇది 25 శాతానికి పడిపోయింది. భారతదేశం తన ఇంధన భద్రత కోసం ఇప్పుడు ఇతర మిడిల్‌ఈస్ట్ దేశాల వైపు మొగ్గు చూపుతోంది.
ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ కీలక ఆవిష్కరణ


