అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్‌! | War Fears Between US and Iran Shake Oil Gold and Stock Markets | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్‌!

Feb 15 2026 1:21 PM | Updated on Feb 15 2026 1:53 PM

War Fears Between US and Iran Shake Oil Gold and Stock Markets

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.

అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్‌పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

శాంతి చర్చలు ఫలించేనా?
ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.

చమురు ధరలు పెరిగే అవకాశం
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

బంగారం, వెండి ధరలపై ప్రభావం
గత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement