దేశంలో అంటువ్యాధుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, ప్రాణాంతక ‘యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్’(ఏంఎఆర్) ముప్పును తగ్గించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సంచలనాత్మక అడుగు వేసింది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే రోగుల్లో ఒకేసారి అనేక రకాల ఇన్ఫెక్షన్లను గుర్తించగలిగే ‘మల్టీప్లెక్స్ మాలిక్యులర్ డయాగ్నొస్టిక్’ పరీక్షను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
సాధారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ, టైఫాయిడ్, ఇన్‌ఫ్లుయెంజా లేదా కొవిడ్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు ఒక్కో వ్యాధికి విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక నివేదిక నెగటివ్ వస్తేనే మరో పరీక్షకు వెళ్లే ఈ దశల వారీ విధానం వల్ల కొన్ని సమస్యలున్నాయి. ఈ విధానం ద్వారా వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకేసారి బహుళ వ్యాధికారక క్రిములను (Pathogens) గుర్తించే సింగిల్-టెస్ట్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ ప్రణాళిక రూపొందించింది.
యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి అడ్డుకట్ట
వ్యాధి ఏంటో స్పష్టంగా తెలియనప్పుడు వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ‘బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్’ వాడుతుంటారు. దీనిపై ఎయిమ్స్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హితేందర్ గౌతమ్ స్పందిస్తూ.. ‘కచ్చితమైన నివేదిక లేకుండా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలో సూక్ష్మజీవుల నిరోధక శక్తి పెరుగుతుంది’ అని హెచ్చరించారు. ఐసీఎంఆర్ ఏఎంఆర్‌ఎస్‌ఎన్ 2024 నివేదిక ప్రకారం, ప్రస్తుతం వాడుకలో ఉన్న అనేక యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై ప్రభావం కోల్పోతున్నాయని తేలింది. కొత్త మల్టీప్లెక్స్ పరీక్షల వల్ల కచ్చితమైన చికిత్స త్వరగా మొదలై ఈ ముప్పు తగ్గుతుంది.
సింగిల్ టెస్ట్‌కు సంబంధించిన కీలక అంశాలు
రోగి లక్షణాల ఆధారంగా ఒకే టెస్ట్‌లో అన్ని అనుమానిత ఇన్ఫెక్షన్లను పరీక్షించడం.
ఈ డయాగ్నొస్టిక్ కిట్లను అభివృద్ధి చేయడానికి భారతీయ తయారీదారులు, పరిశోధన సంస్థలకు ఐసీఎంఆర్ మద్దతు ఇస్తుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.
కొవిడ్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధుల వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వేగవంతమైన నిర్ధారణ పరీక్షలు దేశ ప్రజారోగ్య వ్యవస్థలో కీలక మార్పుగా నిలవనున్నాయి.
ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం


