అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.
భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులు
అధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.
ఎగుమతులు-దిగుమతులు
భారత్ నుంచి ఇరాన్‌కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్‌వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.
ట్రంప్ హెచ్చరిక - భారత్‌పై ప్రభావం
ట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.
భారత్ ఇరాన్‌కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.
ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.
సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవు
భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్‌కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బ
అమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు


