సర్కారును స్వా«దీనం చేసుకోండి
ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపు
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు
ఉండడాన్ని సహించమని స్పష్టీకరణ
వెస్ట్ పామ్ బీచ్: ‘మీ ప్రభుత్వాన్ని మీరు స్వదీనం చేసుకోండి’అంటూ ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తోందని, అమెరికా భూభాగాన్ని తాకే క్షిపణులను తయారు చేసే పనిలో నిమగ్నమైందని ఆరోపించారు. తమ మాట పెడచెవిన పెట్టినందుకే ఇరాన్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై వైమానిక దాడుల పట్ల ఆయన స్పందించారు. ఈ మేరకు 8 నిమిషాల నిడివి గల వీడియోను ‘ట్రూత్ సోషల్’లో పోస్టుచేశారు. ట్రంప్ ఏం చెప్పారంటే..
ఇరాన్ పాలకులు అమెరికా చావును కోరుకుంటున్నారు
‘‘కొద్దిసేపటి క్రితమే అమెరికా సైన్యం ఇరాన్‌లో ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును అంతంచేసి, అమెరికా ప్రజలను రక్షించడమే మా అంతిమ ధ్యేయం. దుష్ట మనస్తత్వం కలిగిన కొందరు వ్యక్తుల గుంపు, వారి హానికర కార్యకలాపాలు అమెరికాకు, మా సైనిక దళాలకు, విదేశాల్లోని మా స్థావరాలకు, మా మిత్రదేశాలకు ప్రత్యక్షంగా ప్రమాదకరంగా మారాయి. ఇరాన్ పాలకులు గత 47 ఏళ్లుగా అమెరికా చావును కోరుకుంటున్నారు. రక్తపాతం సృష్టిస్తున్నారు. సామూహిక హత్యలకు తెగబడుతున్నారు.
మా దేశాన్ని, మా సైన్యాన్ని, ఇంకా చాలా దేశాల్లో అమాయక ప్రజలను టార్గెట్ చేశారు. గతంలో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని హింసాత్మకంగా స్వా«దీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో అమెరికన్లను 444 రోజులపాటు బందీలుగా మార్చారు. 1983లో ఇరాన్ అండదండలున్న ముష్కరులు బీరూట్‌లో అమెరికా జవాన్లపై భీకర దాడులకు పాల్పడ్డారు. 241 మంది జవాన్లను బలి తీసుకున్నారు. 2000 సంవత్సరంలో మా నౌక(యూఎస్‌ఎస్ కోల్)పై దాడులు చేశారు. ఈ ఘటనలో చాలామంది మృతిచెందారు. ఇదంతా మేము మౌనంగా చూస్తూ కూర్చోవాలా? అరాచకానికి ముగింపు పలకాల్సిన అవసరం లేదా?
మీరు కోరుకున్నది ఇచ్చే అధ్యక్షుడిని నేనే
ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డులకు, ఇరాన్ సైనిక దళాలకు, పోలీసులకు నేను చెప్పేది ఒక్కటే. తక్షణమే ఆయుధాలు వదిలేసి లొంగిపోండి. అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. అదే.. చచ్చిపోవడం. లొంగిపోతారో, చచ్చిపోతారో తేల్చుకోండి. లొంగిపోతే గౌరవప్రదంగా చూసుకుంటాం. ఇరాన్ ప్రజలకు చివరిగా నేను చెప్పేది ఏమిటంటే.. మీ స్వాతంత్య్రం మీ చేతుల్లోనే ఉంది. భద్రంగా ఉండండి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు. బయట పరిస్థితి భయానకంగా ఉంది. బాంబుల మోత మోగుతోంది. ఈ దాడులు ఆగిపోయాక మీ ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.
ఈ ప్రభుత్వం ముమ్మాటికీ మీదే. ప్రభుత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మీదే. మీరు ఎన్నో ఏళ్లుగా అమెరికా నుంచి సాయం కోరుతున్నారు. కానీ, ఆ సాయం దక్కలేదు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా ఇరాన్ ప్రజలకు అండగా ముందుకు రాలేదు. ఈరోజు రాత్రి నేను ముందుకొచ్చా. మీరు కోరు కున్నది ఇచ్చే అధ్యక్షుడు మీ ముందున్నాడు. మా మద్దతు మీకు ఉంటుంది. ఇది చర్యకు దిగే క్షణం. ఈ సందర్భాన్ని వృథా కానివ్వొద్దు. మీ విధిని మీరే రాసుకోండి. సౌభాగ్యవంతమైన, గొప్పదైన భవిష్యత్తు మీకు చేతికి అందేటంత దూరంలోనే ఉంది’’అని డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు.


