భగ్గుమన్న పశ్చిమాసియా  | US and Israel attack on Iran, Morethen 200 Killed | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న పశ్చిమాసియా 

Mar 1 2026 1:10 AM | Updated on Mar 1 2026 1:10 AM

US and Israel attack on Iran, Morethen 200 Killed

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు

దద్దరిల్లుతున్న టెహ్రాన్, ఇతర నగరాలు

భారీగా క్షిపణులు, బాంబు దాడులు 

ఖమేనీ తదితరులే లక్ష్యంగా వేట 

పలువురు కీలక కమాండర్ల మృతి! 

స్కూలుపై దాడి, 85 మంది బలి 

మృతులు 200, క్షతగాత్రులు 700

భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్‌ 

ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం 

అమెరికా గల్ఫ్‌ స్థావరాలపై దాడులు 

బహ్రెయిన్, యూఏఈ, ఖతర్,

సౌదీ సహా ఆరేడు దేశాల్లో పేలుళ్లు

దుబాయ్‌: అమెరికా అన్నంత పనీ చేసింది. పశ్చిమాసియాను మరోసారి రణరంగంగా మార్చింది. మిత్ర దేశం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై శనివారం భారీ స్థాయిలో దాడులకు దిగింది. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’పేరిట అమెరికా, ‘ఆపరేషన్‌ రోరింగ్‌ లయన్‌’పేరుతో ఇజ్రాయెల్‌ రణన్నినాదం చేశాయి. శనివారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాలపై క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. 

ముఖ్యంగా ఉత్తర టెహ్రాన్‌లో 30కి పైగా ప్రంతాలపై ఒకేసారి దాడులకు దిగాయి. ఇరాన్‌ నాయకత్వాన్నే లక్ష్యం చేసుకున్నట్టు ఇరు దేశాలూ ప్రకటించాయి. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ (86), అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో పాటు ఇతర అగ్ర నేతలే లక్ష్యంగా దాడులు కొనసాగాయి. తొలి పేలుళ్లు ఖమేనీ, పెజెష్కియాన్‌ నివాసాలు, కార్యాలయాల సమీపంలోనే చోటుచేసుకున్నాయి. అప్పటికే ఖమేనీ, పెజెష్కియాన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఇరాన్‌ వర్గాలు పేర్కొన్నా, పలువురు ఇరాన్‌ కీలక సైనిక కమాండర్లు, నేతలు దాడుల్లో మరణించినట్టు చెబుతున్నారు. 

ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ప్రధాన కార్యాలయ భవనంపై జరిగిన భారీ క్షిపణి దాడులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. టెహ్రాన్‌తో పాటు ఇరాన్‌వ్యాప్తంగా పలు నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. టెహ్రాన్‌లో ఎక్కడ చూసినా దట్టమైన పొగ వెలువడుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడికి దిగడం 8 నెలల్లో ఇది రెండోసారి. గత జూన్‌లో అవి జరిపిన దాడుల్లో ఇరాన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు తదితరాలు బాగా దెబ్బతిన్నాయి. అమెరికాతో పూర్తి సమన్వయంతో దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్‌ పేర్కొంది. 

ఇరు దేశాల సైన్యం నెలల తరబడి రూపొందించిన వ్యూహం మేరకు దాడులు కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో ఏ మేరకు ప్రాణనష్టం జరిగిందో తెలియరాలేదు. ఇరాన్‌ కూడా కొద్ది గంటల్లోనే తేరుకుని దీటుగా స్పందిస్తోంది. తొలుత ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ వెంటనే బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా క్షిపణి దాడులకు దిగింది. కువైట్‌ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి చేసింది. శనివారం రాత్రి సౌదీ అరేబియా, దుబాయ్‌పైనా క్షిపణుల వర్షం కురిపించింది.

 ఈ ఘర్షణలు కనీసం కొద్ది వారాల పాటు కొనసాగుతాయని అమెరికా, ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే జరిగితే పరిస్థితులు త్వరలోనే పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయవచ్చంటున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడిని విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా యుద్ధానికి దిగారంటూ మండిపడింది. మరోవైపు ఇరాన్‌కు దన్నుగా తామూ యుద్ధరంగంలోకి దిగుతామని హెజ్బొల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో పాటు ఎర్ర సముద్రంలోని రవాణా నౌకలను కూడా తిరిగి లక్ష్యంగా చేసుకుంటామని యెమన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్‌ గ్రూపు పేర్కొంది. 

అణు స్థావరాలపైనా దాడులు 
ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా ముమ్మర దాడులు చేస్తున్నాయి. ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ప్రధాన క్షిపణుల కేంద్రం తబ్రీజ్‌పైనా భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్‌తో పాటు నౌకా కేంద్రాలైన చాబహార్, బుషెహర్, అసాలుయెతో పాటు కోమ్, కరజ్, కెర్మన్‌షా తదితర నగరాలు కూడా దాడులకు గురయ్యాయి. వాటిమీదుగా వెలువడుతున్న దట్టమైన పొగ దాడుల తీవ్రతకు అద్దం పడుతోంది.

 దక్షిణ ఇరాన్‌లోని హొర్మోగన్‌ ప్రావిన్స్‌లో మినాబ్‌ నగరంలో ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడుల్లో ఏకంగా 85 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలైనట్టు ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. మరో 50 దాకా గాయపడ్డట్టు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 200 దాటిందని, 700 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్‌ పేర్కొంది. ఇరాన్‌ సైనిక, ప్రభుత్వ, నిఘా కార్యాలయాలను కూడా ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా రక్షణ, అణు స్థావరాలపై పెద్ద సంఖ్యలో క్షిపణి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ, ఇతర అగ్ర నేతల నివాసానికి దారితీసే మార్గాలన్నింటినీ మూసేశారు. 

దేశవ్యాప్తంగా మొబైల్‌ సేవలను కూడా నిలిపేశారు. ఖమేనీని టెహ్రాన్‌ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు నగరాలు వీడి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఇరాన్‌ ప్రతిదాడులతో ఇజ్రాయెల్‌లో ఏ మేరకు ఆస్తి, ప్రాణనష్టం జరిగిందీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో దేశవ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్‌ క్షిపణులను మధ్యలోనే అడ్డుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది. ఇరాన్‌పై దాడులను ట్రంప్‌ ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్‌ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.  

అమెరికా సైనికులను వందలాదిగా చంపేశాం: ఇరాన్‌ 
గల్ఫ్‌వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 14 స్థావరాలను తీవ్రంగా దెబ్బ తీయడంతో పాటు వందల మంది అమెరికా సైనికులను చంపేసినట్టు ప్రకటించింది! అబుదాబిలో అల్‌ దఫ్రా వైమానిక స్థావరంలోని అమెరికా సైనిక వ్యవస్థలపై క్షిపణి దాడులు జరిగాయి. తమ దేశంలోని అమెరికా నావికా స్థావరం ఐదో ఫ్లీట్‌ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు జరిగినట్టు బహ్రయిన్‌ ధ్రువీకరించింది. పశ్చిమాసియాలో అమెరికా సైన్యానికి ప్రధాన స్థావరమైన కువైట్‌ కూడా సైరన్లు, పేలుళ్ల మోతతో అట్టుడికిపోయింది.

 ఖతర్‌లోని అల్‌ ఎదెయ్‌ద్, కువైట్‌లోని అల్‌ సలేం వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగాయి. దుబాయ్, జోర్డాన్, దోహాతో పాటు ఇరాక్‌లో కూడా ఇవే దృశ్యాలు కన్పించాయి. రెండు బాలిస్టిక్‌ మిసైళ్లను నేలకూల్చినట్టు జోర్డాన్‌ సైన్యం పేర్కొంది. అయితే జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌తో పాటు ఇబ్రిద్, జర్ఖా, మదాబా, జరాష్‌ తదితర నగరాల్లో బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. యూఏఈపై ఇరాన్‌ క్షిపణి దాడుల్లో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. తమపై రెండు దఫాలుగా జరిగిన దాడి యత్నాలను పూర్తిగా నిరీ్వర్యం చేసినట్టు ఖతర్‌ ప్రకటించింది. 

యూఏఈ, బహ్రెయిన్, ఖతర్, కువైట్‌పై దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. వాటిని తక్షణం కట్టిపెట్టకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌ను హెచ్చరించింది. తర్వాత కాసేపటికే సౌదీలోని రియాద్‌ తదితర ప్రాంతాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు దిగింది! అయితే వాటిని మధ్యలోనే అడ్డుకుని కూల్చేసినట్టు సౌదీ ప్రకటించింది. తమపై ఇరాన్‌ దాడులను పిరికిపంద చర్యగా అభివరి్ణంచింది. ఆ దేశానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరించింది. రోజుకు 1.4 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా  జరిగే హర్మూజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలను నిలిపేసినట్టు ఇరాన్‌ ప్రకటించింది.

తొలి దాడి ఇజ్రాయెల్‌దే 
శనివారం తొలుత ఇజ్రాయెలే దాడులకు తెర తీసింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ, అధ్యక్షుడు పెజెష్కియానే లక్ష్యంగా ఉదయాన్నే వారి నివాసాలు, కార్యాలయ సముదాయాలపై పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగింది. ఆ వెంటనే మొత్తం టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. అనంతరం అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్‌ అగ్ర నేతలతో పాటు అణు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, భారీ బాంబులతో విరుచుకుపడింది. కొద్ది గంటల అనంతరం ఇరాన్‌ తేరుకుని ప్రతి దాడికి దిగింది. తొలుత ఇజ్రాయెల్‌పై రెండు దఫాలుగా క్షిపణులతో విరుచుకుపడింది. అనంతరం పలు గల్ఫ్‌ దేశాల్లోని పలు అమెరికా స్థావరాలపైనా దాడులకు తెర తీసింది.

ఖమేనీ ఎక్కడ? 
అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇరాన్‌లో నాయకత్వ మార్పే తమ లక్ష్యమని అమెరికా, ఇజ్రాయెల్‌ విస్పష్టంగా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ శనివారం ఉన్నట్టుండి విరుచుకుపడింది. ఖమేనీ నివాసం, కార్యాలయ సముదాయాలపై భారీ స్థాయి క్షిపణి దాడులతోనే యుద్ధానికి తెర తీసింది. ఆ వెంటనే అధ్యక్షుడు పెజెష్కియాన్‌ నివాసం, పరిసర ప్రాంతాలపైనా దాడులు చేసింది. 

అయితే అప్పటికే ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఇరాన్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. అసలు దాడుల సమయంలో ఆయన టెహ్రాన్‌లోనే లేరంటున్నాయి. కానీ ఈ మేరకు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఖమేనీ, అధ్యక్షుడు ‘తనకు తెలిసినంత వరకూ’జీవించే ఉన్నారని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ చెప్పడం విశేషం. ఇజ్రాయెల్‌ సైనిక వర్గాలు మాత్రం తమ దాడుల్లో ఖమేనీ మరణించే ఉంటారని అంటున్నాయి!

ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి! 
రెవల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ కూడా
ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి అమీర్‌ నసీర్‌జాదే, రెవల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ మొహమ్మద్‌ పక్పూర్‌ చనిపోయినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. అయితే వీరిద్దరి మరణాన్ని ఇరాన్‌ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు అమీర్‌ నసీర్‌జాదే ఇరాన్‌ సాయుధ దళాలకు డెప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా సేవలందించారు. ఆయన యుద్ధ పైలట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి దేశ రక్షణమంత్రి అయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement