ఆతిథ్యం అదరహో | India Hospitality Sector Set for Revenue Growth | Sakshi
Sakshi News home page

ఆతిథ్యం అదరహో

Mar 6 2026 8:42 AM | Updated on Mar 6 2026 9:18 AM

India Hospitality Sector Set for Revenue Growth

ఆదాయంలో 12 శాతం వృద్ధి

అన్ని విభాగాల్లో స్థిరమైన డిమాండ్‌

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక 

ఆతిథ్య పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన పనితీరు నమోదు చేయనుంది. ఆదాయం 9 నుంచి 12 శాతం వరకు పెరుగుతుందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అన్ని విభాగాల్లో స్థిరమైన డిమాండ్‌ ఉన్నట్టు తెలిపింది. దేశీ విహార పర్యటనలు, ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) కార్యకలాపాలు, వివాహాలు, కార్పొరేట్‌ డిమాండ్‌ మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. 2024–25లో ఈ రంగం పనితీరు గణనీయమైన వృద్ధిని చూసినప్పటికీ.. అక్కడి నుంచి మెరుగైన వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదు కానుందని తెలిపింది.

దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో ఆక్యుపెన్సీ (భర్తీ) 72–74 శాతం స్థాయిలో ఉంటుందని.. మొదటి 11 నెలల్లో (ఫిబ్రవరి నాటికి) 71–73 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. గదుల సగటు రేటు (ఏఆర్‌ఆర్‌) గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.8,000–8,200 నుంచి 8,200–8,500కు పెరగనున్నట్టు అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్‌ పరిస్థితులతో ధరలను పెంచుకునే స్వేచ్ఛ ఉన్నట్టు వివరించింది. ప్రీమియం గదుల లభ్యత దేశవ్యాప్తంగా 12 ముఖ్య పట్టణాల్లో 5–6 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. డిమాండ్‌–సరఫరా మధ్య అంతరం వచ్చే 2–3 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపింది.

టైర్‌–2, 3 పట్టణాల్లో కార్పొరేట్‌ ప్రయాణాలు, వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, ఎంఐసీఈ కార్యక్రమాలు, కచేరీలు, క్రీడా కార్యక్రమాలతో డిమాండ్‌ వైవిధ్యంగా ఉన్నట్టు వివరించింది. దీంతో అంతర్జాతీయ, సైక్లికల్‌ షాక్‌ల రిస్క్‌ తగ్గినట్టు పేర్కొంది. ఫ్రాంచైజీలు, నిర్వహణ కాంట్రాక్టులతో అస్సెట్‌ లైట్‌ (లీజు వసతులతో) విధానంలో హోటల్‌ కంపెనీలు విస్తరణపై దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. దీంతో పెద్దగా పెట్టుబడులు అవసరం లేకుండానే ఫీజుల ఆదాయం, బలమైన నగదు ప్రవాహాలకు ఈ నమూనాలు దోహదపడతాయని వివరించింది.

ఇదీ చదవండి: పల్లె మహిళల్లోనూ యూపీఐ పరిమళాలు

Advertisement
 
Advertisement
Advertisement