మహీంద్రా సిగ్నేచర్ రిసార్ట్‌తో షురూ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ తాజాగా విరామ సంబంధ ఆతిథ్య(లీజర్ హాస్పిటాలిటీ) విభాగంలోకి ప్రవేశించనుంది. మహీంద్రా సిగ్నేచర్ రిసార్ట్స్ బ్రాండుతో సొంత అనుబంధ సంస్థ ద్వారా లీజర్ హాస్పిటాలిటీ సేవలు ప్రారంభించనుంది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం వెకేషన్ ఓనర్‌షిప్ విభాగంలో సరీ్వసులందిస్తున్న కంపెనీ మహీంద్రా సిగ్నేచర్ రిసార్ట్స్ బ్రాండుతో తాజాగా లీజర్ మార్కెట్లో విలాసవంత(లగ్జరీ) ఆతిథ్య సేవలను ప్రవేశపెట్టనుంది.
ఈ విభాగంలో 2030కల్లా 2,000 గదులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లీజర్ హాస్పిటాలిటీలోకి ప్రవేశించడం ద్వారా ప్రస్తుత బిజినెస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనున్నట్లు మహీంద్రా హాలిడేస్ పేర్కొంది. తద్వారా పర్యటన(టూరిజం) రంగంలోని వేగవంత వృద్ధిలో ఉన్న విభాగాలు, కస్టమర్లను ఆకట్టుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ప్రాథమిక దశలో పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు వెల్లడించింది.
విభిన్నంగా..
దేశీయంగా సెలవుదినాలను విభిన్నంగా వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు మహీంద్రా హాలిడేస్ ఎండీ, సీఈవో మనోజ్ భట్ పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ టూరిజంతో పోలిస్తే మరింత ఆకర్షణీయ ప్రయాణాలు, అనుభూతులకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా టాప్ లీజర్ ఆతిథ్య రంగ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా క్లబ్ మహీంద్రాను ‘క్లబ్ ఎం’గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2030కల్లా 10,000 గదులకు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్‌ఎస్‌ఈలో మహీంద్రా హాలిడేస్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 333 వద్ద ముగిసింది.


