
రూ. 2,400 కోట్లు వేతనాల చెల్లింపు
ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ నివేదికలో వెల్లడి
ముంబై: గతేడాది భారత్‌లో 1.11 లక్షల ఉద్యోగాల కల్పనకు చేయూతనిచ్చినట్లు, వేతనాల కింద దాదాపు రూ. 2,400 కోట్ల మేర చెల్లింపునకు దోహదపడినట్లు హోమ్–షేరింగ్ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. దేశీయంగా టూరిజం, ఆతిథ్య రంగంలో సంస్థ ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. ఎయిర్‌బీఎన్‌బీ తరఫున ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ రూపొందించిన నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం భారత్‌లో బస, బసయేతర అవసరాల కోసం ఎయిర్‌బీఎన్‌బీ అతిథులు 2024లో రూ. 11,200 కోట్లు వెచి్చంచారు.
దేశీయంగా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం గెస్టుల్లో దేశీ పర్యాటకుల వాటా 2019లో 79 శాతంగా ఉండగా గతేడాది నాటికి 91 శాతానికి పెరిగింది. అటు విదేశీ గెస్టుల విషయం తీసుకుంటే అమెరికా, యునైటెడ్ కింగ్‌డం, కెనడా, ఆస్ట్రేలియా నుంచి అత్యధిక శాతం మంది ఉన్నారు. నివేదిక ప్రకారం.. గెస్టులు సగటున రెండు రాత్రుళ్లు బస చేయగా, డైనింగ్, రిటైల్ స్టోర్స్, రవాణాలాంటి బసయేతర అవసరాలపై రోజూ రూ. 11,000 మేర ఖర్చు చేశారు. ప్రతి రూ. 10,000 వ్యయంలో రెస్టారెంట్లలో రూ. 3,800, రవాణాపై రూ. 2,400, షాపింగ్‌పై రూ. 2,100, కళలు.. వినోదంపై రూ. 900, నిత్యావసరాలపై రూ. 800 ఖర్చు చేశారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ పర్యాటకం ఆధారిత కొలువుల్లో 0.2 శాతం (ప్రతి 417 ఉద్యోగాల్లో ఒకదానికి సమానం) ఉద్యోగాలకు ఎయిర్‌బీఎన్‌బీ దోహదపడింది.
→ టూరిజంకే పరిమితం కాకుండా విస్తృత ఎకానమీకి కూడా సంస్థ కార్యకలాపాలు ఉపయోగపడ్డాయి. రవాణా.. స్టోరేజీ విభాగానికి రూ. 3,100 కోట్లు, వ్యవసాయానికి రూ. 1,500 కోట్లు, రియల్ ఎస్టేట్‌కి రూ. 1,300 కోట్ల మేర విలువ చేకూర్చాయి. రవాణా..స్టోరేజీలో 38,000 ఉద్యోగాలు, ఫుడ్..బెవరేజెస్ విభాగంలో 19,600, హోల్‌సేల్..రిటైల్ ట్రేడ్‌లో 16,800, తయారీలో 10,700 ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డాయి. దీనితో వేతనాలపరమైన ప్రయోజనాలు కూడా ఒనగూరాయి. రవాణా .. స్టోరేజ్ల్‌ో రూ. 810 కోట్లు, తయారీలో రూ. 290 కోట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో రూ. 260 కోట్ల మేర వేతనాలకు చెల్లింపునకు తోడ్పడ్డాయి.