కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రీసేల్ మార్కెట్ అంటూ ప్రత్యేకమైన ఒరవడిని సృష్టిస్తోంది. కొత్త కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులతో పాటు రీసేల్ మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయని భావించి ఈ రంగంలోకి అనేక మంది ప్రవేశిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు, విక్రయాల్లో వినియోగదారులు, ఇన్వెస్టర్లు, బ్రోకర్లకు సమానంగా లాభాలు అందించడంలో ఈ రీసేల్ సెగ్మెంట్ కీలకపాత్ర పోషిస్తోంది. అదే సమయంలో నగర జీవనశైలిపై కూడా స్పష్టమైన ప్రభావం చూపుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్‌లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగావకాశాలు పెరిగే కొద్దీ, వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరమైన నివాసాల కోసం డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది రెడీ టు మూవ్ ఇళ్లు, వెంటనే ఉపయోగించుకునే ఫ్లాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కన్‌స్ట్రక్షన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటం కంటే రీసెల్ ప్రాపర్టీ తీసుకోవడం సౌకర్యంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
సులభంగా బ్యాంక్ లోన్లు..
రీసేల్‌లో ప్రధానంగా పెట్టుబడి తక్కువ. కొత్త వెంచర్లు వంటి భారీ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయాలు, ప్రీలాంచ్ ప్రకటనలు, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ వంటి ఖర్చులు ఉండవు. ఇప్పటికే ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం వల్ల రిస్క్ కూడా తక్కువ. రీసేల్ ప్రాపర్టీలకు సాధారణంగా రెడీ డాక్యుమెంటేషన్ ఉండటం, బ్యాంక్ లోన్లు సులభంగా లభించడం, వాస్తు/ప్రాంతీయ వివరాలు ఇప్పటికే తెలిసి ఉండటం కొనుగోలుదారులకు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.
ఇదే కారణంగా ఈ రంగంలో ఇన్వెస్టర్లు కూడా వేగంగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ రంగంలో ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇచ్చే వ్యవస్థ తగ్గిపోతోంది. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు, రియల్ ఎస్టేట్ లిస్టింగ్ యాప్‌లు, సోషల్ మీడియా మార్కెటింగ్‌తో ప్రాపర్టీ యజమానులు నేరుగా కస్టమర్లతో మాట్లాడే అవకాశం పెరిగింది. ప్రధానంగా మధ్యవర్తి ఖర్చులు తగ్గి, విక్రేతలకు ఎక్కువ లాభం, కొనుగోలుదారులకు తక్కువ ధరకు లభిస్తోంది. ఈ మార్పు రియల్ ఎస్టేట్ లావాదేవీలను మరింత పారదర్శకంగా చేస్తోంది.
రెడీ ఇళ్లకు అధిక డిమాండ్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు.. శంషాబాద్, షాద్‌నగర్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లోని ప్లాట్లు, వెంచర్లు.. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, మణికొండ, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రీసెల్ మార్కెట్ చురుగ్గా మారింది. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో రెడీ ఇళ్లకు డిమాండ్ నిరంతరం ఉంటుంది. ఇక అపార్ట్‌మెంట్లతో పాటు విల్లాలు, సొంత గృహాలు, జీ ప్లస్–1, జీ ప్లస్–2 హౌసింగ్ యూనిట్లు కూడా పెద్ద సంఖ్యలో రీసేల్ అవుతున్నాయి.
లైఫ్‌స్టైల్ కోణం నుంచి చూస్తే రీసేల్ మార్కెట్ నగర జీవనశైలిలో కొత్త అనుభవాన్ని తెచ్చింది. ఉద్యోగ మార్పులు, నగరాల మధ్య తరలింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ విస్తరణ.. వంటివి వేగంగా జరిగే ఈతరం వెంటనే మకాం మార్చుకునేందుకు వీలైన ఇళ్లు ప్రధాన అవసరంగా మారాయి. ఈ అవసరాన్ని తీర్చడంలో రీసేల్ సెగ్మెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. భద్రత, రవాణా సౌకర్యాలు, స్కూళ్లు, హాస్పిటల్స్, మార్కెట్లు తదితర వాటిని చూసుకునే ఇంటిని నిర్మించుకుంటారు. దీంతో వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
భవిష్యత్‌లో మరింత బలపడే అవకాశం
ప్రస్తుత మాంద్యం పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే, రెంటల్ ఇన్‌కమ్ కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారికి రీసేల్ ప్రాపరీ్టలు తక్షణ లాభం అందిస్తున్నాయి. నగర వృద్ధి వేగం పెరగడంతో భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రీసేల్ విభాగం సంప్రదాయ కొనుగోలు, అమ్మకాల నమూనాను మార్చి, కొత్త తరానికి అనుగుణంగా జీవన శైలిని ప్రతిబింబించే ట్రెండ్‌గా ఎదుగుతోంది. ఈ వినూత్న మార్పులు, తక్కువ రిస్క్, ఎక్కువ లాభాలు, స్మార్ట్ లివింగ్ అవసరాల కలయికగా ఈ రంగాన్ని రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యంతో ముందుకు నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


