పండుగ సీజన్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు దన్నుతో ఎకానమీ పరుగులు తీసిన నేపథ్యంలో దేశీయంగా నవంబర్‌లో డీజిల్ అమ్మకాలు ఆరు నెలల గరిష్టానికి ఎగిశాయి. పెట్రోలియం ప్లానింగ్, అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం వార్షిక ప్రాతిపదికన 4.7 శాతం పెరిగి 8.55 మిలియన్ టన్నులుగా నమోదైంది. మే నెల తర్వాత ఇది అత్యధిక స్థాయి. జూన్‌లో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి సెపె్టంబర్ వరకు తగ్గుముఖం పట్టిన అమ్మకాలు అక్టోబర్‌లో తిరిగి కొంత పుంజుకుని 6.79 మిలియన్ టన్నులకు చేరుకోగా, నవంబర్‌లోనూ అదే ధోరణి కొనసాగింది.
2023 నవంబర్ నాటి 7.52 మిలియన్ టన్నులతో పోలిస్తే తాజాగా 13.61 శాతం, కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే వార్షికంగా 2 శాతం మేర డీజిల్ వినియోగం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో డీజిల్ అమ్మకాలు వార్షికంగా 2.76 శాతం పెరిగి 61.85 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. మరోవైపు, నవంబర్లో పెట్రోల్ వినియోగం 2.19 శాతం పెరిగి 3.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. విమాన ఇంధనం వినియోగం 4.7 శాతం పెరిగి 7,83,000 టన్నులకు, ఎల్‌పీజీ విక్రయాలు 7.62 శాతం వృద్ధితో 3 మిలియన్ టన్నులకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో పెట్రోల్ డిమాండ్ 6.25 శాతం పెరిగి 28.35 మిలియన్ టన్నులకు చేరింది.
ఇదీ చదవండి: తయారీపై ‘టారిఫ్‌ల’ ప్రభావం


