బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి. దీని ప్రభావం పలు రంగాలపై పడుతోంది. ముఖ్యంగా భగభగమంటున్న బంగారం ధరలకు ఆయుర్వేద వైద్యం విలవిలలాడుతోంది. ఈ మాట వినగానే ఆయుర్వేదానికి, బంగారానికి సంబంధం ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. ఈ రెండింటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఆయుర్వేద మందులలలో బంగరాన్ని ఉపయోగిస్తారు. ఏడాది కాలంలో బంగారం ధరలు ఏకంగా 75 శాతం, వెండి ధరలు 167 శాతం పెరిగాయి. ఫలితంగా ఈ లోహాలను ఉపయోగించి తయారుచేసే ఆయుర్వేద మందుల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. బంగారం, వెండిని ఆయుర్వేదంలో ప్రాణరక్షక మందులలో ‘నానో పార్టికల్స్’ రూపంలో వాడుతుంటారు.
ఆకాశానికి ఔషధ ధరలు
ఆయుర్వేద వైద్యంలో బలహీనతను పోగొట్టే ‘స్వర్ణ భస్మం’ ధర రూ. 19 వేల నుండి రూ. 26 వేలకు చేరుకుంది. దీనికి బంగారం ధరల పెరుగుదలే కారణమని తెలుస్తోంది. అలాగే డయాబెటిస్ కోసం వాడే ప్రసిద్ధ మందు ‘వసంత కుసుమాకర్’ ధర రూ. 1100 వరకు పెరిగింది. సాధారణంగా శీతాకాలంలో సంజీవనిలా భావించే ‘వన్‌ప్రాష్’కూడా ధరల పెరుగుదల నుంచి తప్పించుకోలేకపోయింది. బంగారం వాడే మందుల ధరలు 40-50 శాతం, వెండిని వాడే మందుల ధరలు 20-25 శాతం వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

వ్యాధులను నివారించే బంగారం, వెండి
ఆయుర్వేదంలో బంగారం, వెండిని ‘నోబుల్ మెటల్స్’గా పిలుస్తారు. బంగారం శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడానికి ఉపయోగపడితే,వెండి మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఉపకరిస్తుంది. తీవ్రమైన కాలిన గాయాలకు వాడే క్రీములలో, ఇన్ఫెక్షన్ నివారణ మందులలో వెండిని విరివిగా ఉపయోగిస్తుంటారు. బంగారం, వెండి ధరలు ఇదే రీతిన పెరిగితే రోగులకు నాణ్యమైన చికిత్స అందించడం కష్టమని నిపుణులు అంటున్నారు.

వైద్య విద్యార్థులు డీలా..
బంగారం ధరల పెరుగుదల ప్రభావం కేవలం రోగులపైనే కాకుండా, ఆయుర్వేద విద్యార్థులపైన కూడా పడుతోంది. పీహెచ్‌డీ విద్యార్థులు తమ పరిశోధనల కోసం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1.30 లక్షలు దాటడంతో, ప్రభుత్వం ఇచ్చే రూ. 60-80 వేల స్టైపెండ్ దేనికీ సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు తమ జేబుల నుండి డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇది వారి పరిశోధనలకు ఆటంకంగా మారింది.

కుదేలైన ఆయుర్వేద వ్యాపారం
రాజస్థాన్‌లో ఆయుర్వేద మందుల వార్షిక వ్యాపారం సుమారు రూ. 100 నుండి 150 కోట్లుగా ఉంది. జలుబు, దగ్గు, డయాబెటిస్, యూరినరీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులకు వాడే దాదాపు 50 రకాల మందులలో ఈ బంగారం, వెండి లోహాలను ఉపయోగిస్తారు. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం, వెండి కోటింగ్ ఉండే మాత్రల ధరలు కూడా 10 శాతం మేరకు పెరిగాయి. ఫలితంగా కొనుగోళ్లు తగ్గి, వ్యాపారం మందగించింది.

ముందులు కొనలేక విలవిల
బంగారం ధరల పెరుగుదల కారణంగా ఆయుర్వేద వైద్యులు ఖరీదైన మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాయడానికి వెనుకాడుతున్నారు. ఒకవేళ రాసినా, పేద రోగులు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మరోవైపు మందుల తయారీ కంపెనీలు ధరలను నియంత్రించేందుకు నాణ్యత లేని ముడి పదార్థాలను వాడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరోక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
దంత వైద్యం కూడా భారమే..
కేవలం ఆయుర్వేద వైద్యమే కాదు.. దంత వైద్యం కూడా ఖరీదైనదిగా మారింది. పళ్లలోని క్యావిటీలను నింపడానికి, క్రౌన్స్ వేయడానికి వాడే సిల్వర్ అలాయ్ పౌడర్ ధరలు భారీగా పెరిగాయి. గతంలో 30 గ్రాముల సిల్వర్ అలాయ్ ధర రూ. 2,638 ఉండగా, ఇప్పుడు అది రూ. 3,808కి చేరింది. ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లలో ఒక పంటి ఫిల్లింగ్‌కు రూ. 800 నుండి రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు.
తీవ్ర అస్థిరత
జనవరి 14 నాటి గణాంకాల ప్రకారం.. వెండి కేవలం మూడు రోజుల్లోనే రూ. 34 వేలు పెరిగి కిలో రూ. 2.78 లక్షల వద్ద ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. బంగారం కూడా 10 గ్రాములకు రూ. 1.42 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్థాయి భారీ పెరుగుదల గతంలో ఎన్నడూ లేదని, ఫలితంగా వైద్య , పరిశ్రమల రంగాల్లో తీవ్ర అస్థిరత నెలకొన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: 2026 ‘బిగ్ ఫైట్’: అటు బెంగాల్ పులి.. ఇటు తమిళ ‘దళపతి’!


