దేశంలో ప్రతీయేటా ఎన్నికల కోలాహలం సాధారణమే అయినా, ప్రస్తుత 2026లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే సత్తాను కలిగి ఉన్నాయి. తూర్పున అస్సాం, పశ్చిమ బెంగాల్.. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఏడాది మోగనున్న ఎన్నికల నగారా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ప్రాంతీయ శక్తులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే (డీఎంకే)లకు పెద్ద సవాల్‌ను విసరనున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా, పార్టీల సంస్థాగత నిర్మాణం, నాయకత్వ పటిమ మొదలైనవి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
బీజేపీ ముంగిట భారీ సవాళ్లు
అస్సాం, పుదుచ్చేరిలలో ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సవాల్ కానున్నాయి. మరోవైపు 14 ఏళ్లుగా బెంగాల్‌ను ఏలుతున్న మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడం కమలనాథుల ప్రధాన లక్ష్యంగా మారింది. ఇక కేరళలో సీపీఎం (ఎల్‌డీఎఫ్), తమిళనాడులో డీఎంకే తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందరి దృష్టి ఆ రాష్ట్రాలపైనే..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపైనే నిలిచింది. బెంగాల్‌లో దశాబ్ద కాలానికిపైగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై సహజంగానే కొంత వ్యతిరేకత ఉండే అవకాశముందని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్ తదితర అంశాలు మమత సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నా, బీజేపీ ఈ అంశాలను ఓట్లుగా మలుచుకోగలదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పొత్తులే నిర్ణయాత్మక శక్తులు
గుజరాత్‌లో బీజేపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నట్లే.. బెంగాల్‌లో మమత కూడా తన పట్టు నిలుపుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అస్సాంలో గత ఎన్నికల్లో బీజేపీ కూటమి సునాయాసంగా గెలిచినా, విపక్ష ‘మహాజోత్’ కూటమికి, ఎన్డీయేకి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 4 శాతం మాత్రమే ఉండటం గుర్తించదగినది. రాబోయే ఎన్నికల్లో చిన్నపాటి ఓట్ల చీలిక కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో, పొత్తులే ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని తెలుస్తోంది. పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమి తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆసక్తికర వ్యూహాలు రచిస్తోంది.
కేరళలో పుంజుకుంటున్న బీజేపీ
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ఈసారి రాజకీయ ముఖచిత్రం కొంత భిన్నంగా కనిపిస్తోంది. సంప్రదాయంగా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్యే అధికారం చేతులు మారే కేరళలో.. బీజేపీ అనూహ్యంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ సీటు గెలవడం, ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్‌లో మెజారిటీకి చేరువగా రావడం కమలదళంలో ఉత్సాహాన్ని నింపింది.
తమిళనాట విజయ్ ప్రకంపనలు
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించిన విజయ్.. ఒంటరిగానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. విజయ్ భారీ బహిరంగ సభలకు జనం వస్తున్నా, ఆ జనసందోహం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది సందేహంగా మిగిలింది. ద్రవిడ పార్టీల ఆధిపత్యం నడిచే తమిళనాడులో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఈసారైనా సత్తా చూపుతాయా లేక ప్రాంతీయ పార్టీల నీడలోనే కొనసాగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది
‘ఇండియా’ కూటమి ఏమవునో..
2026 ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమి మనుగడకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి గీటురాయిగా నిలవనున్నాయి. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఈసారి కూడా ఓడిపోతే పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. కేరళలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్.. ఈ ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే రాహుల్ గాంధీ సామర్థ్యంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే ప్రమాదముంది. మరోవైపు బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌కు కూడా ఈ ఎన్నికలు తొలి పరీక్షగా నిలవనున్నాయి. మొత్తంగా చూస్తే, పశ్చిమ బెంగాల్‌లో మమత, తమిళనాడులో స్టాలిన్ గెలుపుపైనే ‘ఇండియా కూటమి’ భవిష్యత్తు ఆధారపడి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మీ నిద్రలోనే మీ ఆయుష్షు!


