సాధారణంగా మనమంతా నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతి దశగా భావిస్తాం. అయితే ఇదే అంశంపై అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక నూతన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఒక రాత్రి నిద్రలో మన శ్వాస తీరు, గురక శబ్దాలు, ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని వారు నిరూపించారు.
రక్త పరీక్షలు, ఎక్స్-రేలు లాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే, మనం నిద్రపోయే తీరుతెన్నులే మన ఆరోగ్య స్థితిని చక్కగా వివరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా అనిపించినప్పటికీ, శాస్త్రవేత్తలు తమ నవ్య ఆవిష్కరణలో దీనిని నిజం చేసి చూపారు. స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు తాజాగా ‘స్లీప్‌ఎఫ్‌ఎం’ (SleepFM) అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలను, శ్వాస, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది.
‘స్లీప్‌ఎఫ్‌ఎం’నకు సంబంధించిన పరిశోధనా పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర శ్వాస విధానం, హృదయ స్పందనల వేగం, పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది. తద్వారా ఇది సుమారు 130 రకాల వివిధ వ్యాధులను ఇది ముందే గుర్తించగలుగుతుంది.
సుమారు 65 వేల మందికి సంబంధించిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించి, ఈ మోడల్‌ను రూపొందించారు. ఈ స్లీప్‌ఎఫ్‌ఎం మోడల్ ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ మోడల్ 80 శాతం కచ్చితత్వంతో గుర్తించగా, డిమెన్షియా లాంటి మెదడు సంబంధిత వ్యాధులను 85 శాతం కచ్చితత్వంతో అంచనా వేసింది. కిడ్నీ వైఫల్యాన్ని 80 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 90 శాతం మేర కచ్చితంగా గుర్తించింది. మొత్తంగా చూస్తే, ఈ ఏఐ వైద్యుడు దాదాపు 75 శాతం కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
మన శరీరం లోపల వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చేవరకూ వైద్యుడిని సంప్రదించరు. అయితే స్లీప్‌ఎఫ్‌ఎం పరికరం అందుబాటులో ఉంటే, ఏ వ్యాధిని అయినా ప్రాథమిక దశలోనే గుర్తించి, అప్రమత్తం కావచ్చు. భవిష్యత్తులో మన స్మార్ట్‌వాచ్ లేదా మన పరుపులోని సెన్సార్లు మన నిద్రను విశ్లేషించి.. ‘మీ ఆరోగ్యం సరిగా లేదు.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని హెచ్చరించే రోజులు దగ్గరలోనే రానున్నాయి. ఇది వైద్య ప్రపంచంలో ఒక గొప్ప విప్లవానికి నాంది కానుంది.
ఇది కూడా చదవండి: ‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం..


