గాజా/కైరో: గత రెండేళ్లుగా ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధం, అగ్ర నాయకత్వ లేమి మధ్య పాలస్తీనా సాయుధ పోరాట సంస్థ ‘హమాస్’ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రనేత యాహ్యా సిన్వార్ మరణంతో ఖాళీ అయిన అత్యున్నత నాయకత్వ పీఠాన్ని భర్తీ చేసేందుకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖతార్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల కౌన్సిల్ నేతృత్వంలో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడి తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, హమాస్ మనుగడను కాపాడే కొత్త వారసుడు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.
హమాస్ కొత్త అగ్రనేత రేసులో ప్రధానంగా ఖలీద్ మెషాల్, ఖలీల్ అల్-హయ్యా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఖలీద్ మెషాల్ గతంలో హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించారు. సున్నీ ముస్లిం దేశాలతో మంచి దౌత్య సంబంధాలు కలిగిన మెషాల్ సంస్థలో కీలక నేతగా గుర్తింపు పొందారు. మరోవైపు, ఖలీల్ అల్-హయ్యా ప్రస్తుతం హమాస్‌కు ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన హయ్యా ఎన్నికైతే, హమాస్‌పై ఇరాన్ పట్టు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
హమాస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన 50 మంది సభ్యుల షురా కౌన్సిల్ రహస్య బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికను నిర్వహించనుంది. ఒక్క ప్రధాన నేతనే కాకుండా, 2024లో లెబనాన్ దాడిలో మరణించిన సలేహ్ అల్-అరూరి స్థానంలో కొత్త ఉప నాయకుడిని కూడా కమిటీ ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ లక్షిత దాడుల నేపథ్యంలో, ఒకే వ్యక్తికి పగ్గాలు అప్పగించే కంటే సమిష్టి నాయకత్వం వైపు వెళ్లడమే సురక్షితమని సంస్థలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. 1987లో స్థాపించిన హమాస్ ప్రస్తుతం అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో అక్టోబర్‌లో కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, గాజాలోని సగ భూభాగం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది.
ఇది కూడా చదవండి: Thailand: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్..22 మంది మృతి


