బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో నేటి(బుధవారం) ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాట్చథానీ వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలుపై భారీ క్రేన్ ఒక్కసారిగా తెగిపడింది. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని సిఖియు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:00 గంటలకు ఈ ఘటన జరిగింది. క్రేన్ కూలిన ధాటికి రైలు పట్టాలు తప్పడమే కాకుండా, మంటలు కూడా చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించిన అధికారులు.. ఆ ప్రాంతంలో జరుగుతున్న హై-స్పీడ్ రైలు వంతెన నిర్మాణ పనులే ఈ ప్రమాదానికి దారి తీశాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద క్రేన్ అదుపు తప్పి కదిలే రైలుపై పడటంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందన్నారు. థాయ్ ప్రభుత్వం తన అధికారిక ‘ఎక్స్’ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సిఖియు ప్రాంతంలో రైలు పట్టాలు తప్పి, మంటలు వ్యాపించాయని, ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని తెలిపింది.
ఈ ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం భారీగా ఉన్నట్లు ఏఎఫ్పీ (ఏఎఫ్‌పీ) వార్తా సంస్థ తెలిపింది. తొలుత మరణాల సంఖ్య 12గా భావించినప్పటికీ, నఖోన్ రాట్చసిమా ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ థాచ్చపోన్ చిన్నవాంగ్ అందించిన తాజా సమాచారం ప్రకారం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రైలు బోగీల్లో ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని, రైలులో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రస్తుతం పలు సహాయక బృందాలు రంగంలోకి దిగి, బోగీల్లో చిక్కుకున్న బాధితులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Construction crane for high-speed rail bridge collapsed onto moving passenger train in Sikhiu, Nakhon Ratchasima this morning (14 Jan) at 9:05 am. Train derailed and caught fire. 30+ passengers injured, many trapped in carriages. Multiple rescue teams deployed. pic.twitter.com/X4c0vyQIwA
— PR Thai Government (@prdthailand) January 14, 2026


