ఒక భార్య... ఇద్దరు భర్తలు | Thailand woman marries two Austrian men with family blessings | Sakshi
Sakshi News home page

ఒక భార్య... ఇద్దరు భర్తలు

Mar 3 2026 5:25 AM | Updated on Mar 3 2026 5:25 AM

Thailand woman marries two Austrian men with family blessings

ఇద్దరినీ ఏకకాలంలో వివాహమాడిన థాయ్‌ మహిళ

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ దువాంగ్‌దువాన్‌ కెట్సారో వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కనుల పండువగా జరిగినందుకో లేక అట్టహాసంగా జరిగినందుకో కాదు..పెళ్లి జరిగిన తీరు విచిత్రంగా ఉండటమే అందుకు కారణం. కెట్సారో ఇటీవల జరిగిన వేడుకలో ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మనువాడింది. వీరిద్దరితో ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధం నిజాయతీ, పరస్పర అంగీకారమే మూలమని ఆమె అంటోంది. 

గాయని, పాటల రచయిత అయిన కెట్సారో మొదటగా ఆస్ట్రియా వాసి రోమన్‌తో స్నేహం చేసింది. రిటైర్డు పోలీసు అధికారి అయిన రోమన్‌తో కలిసి పట్టాయా నగరంలో ఐదేళ్లపాటు కలిసి సహజీనం సాగించింది. ఆ సమయంలో వారి బంధం బలపడింది. తర్వాత, ఆస్ట్రియాకే చెందిన పోలీసు అధికారి మ్యాకీతో పరిచయమేర్పడింది. ఇతడికి దగ్గరైంది. వీరి ముగ్గురి మధ్య బంధం క్రమంగా ఒక అసాధారణ భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది.

 ముగ్గురూ కలిసి కూర్చుని భవిష్యత్తులో కలిసి ఎలా ఉండాలనే విషయం చర్చించుకుని, ఒక నిర్ణయం తీసుకున్నారు. కాగా, కెట్సారోకు మొదటి వివాహం ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు మనవలు ఉన్నారు. తల్లిదండ్రులు, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులకు సైతం ఆస్ట్రియా వాసులతో కొనసాగుతున్న బంధాన్ని గురించి తెలిపింది. పాటలు రాయడం, పాటడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరక ఇబ్బందులు పడుతున్న సమయంలో రోమన్, మ్యాకీలు తనకెంతో బాసటగా నిలిచారని కెట్సారో అంటోంది. 

తన కుటుంబానికి కూడా సాయపడ్డారని తెలిపింది. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారని, వారు తన పట్ల చూపే శ్రద్ధ, అంకితభావమే ఇందుకు కారణమని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఆస్ట్రియా వరులు చెరో లక్ష బహాట్‌లు, మన కరెన్సీలో సుమారు రూ.29 లక్షలను కెట్సారోకు సమర్పించుకున్నట్లు సమాచారం. సమాజంలో మారుతున్న వివాహ సంబంధాలకు వీరి పెళ్లి తాజా ఉదాహరణగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement