స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టే ఏ వ్యవస్థాపకుడికైనా నిధుల సేకరణ (Fundraising) అనేది ఒక పెద్ద సవాలు. అటువంటి తరుణంలో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల సీఈఓల నుంచి స్పందన లభిస్తే ఆ ఉత్సాహమే వేరు. సరిగ్గా ఇలాంటి అనుభవమే సింగపూర్‌కు చెందిన భారతీయ పారిశ్రామికవేత్త మనోజ్ అహిర్వార్‌కు ఎదురైంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్‌కు ఆయన పంపిన ఒక ఈమెయిల్ తన జీవితాన్నే మార్చేసినట్లు ఇటీవల గుర్తుచేసుకున్నారు.
ఆ ఒక్క ఈమెయిల్ ఇచ్చిన ధైర్యం
2022లో మనోజ్ అహిర్వార్ తన స్టార్టప్ ఆలోచనను వివరిస్తూ నితిన్ కామత్‌కు మెయిల్ పంపారు. సాధారణంగా బిజీగా ఉండే దిగ్గజ సీఈఓల నుంచి స్పందన రావడం కష్టమని భావించిన అహిర్వార్‌కు కేవలం ఒక్క గంటలోనే కామత్ నుంచి రిప్లై రావడంతో ఆశ్చర్యపోయారు. అయితే ఆ వ్యవహారం పెట్టుబడికి సంబంధించింది కాకపోయినప్పటికీ, నితిన్ చూపిన చొరవ అహిర్వార్‌పై ఎంతో ప్రోత్సాహంగా మారింది.
I reached out to Nithin Kamath back in 2020 when I launched my startup MoneyFit.
I didn't expect a reply, but he responded within an hour.
While I didn't end up getting investment from Zerodha, it was incredible to see how accessible he was. You could just reach out directly to… pic.twitter.com/0js1ncnK8w— Manoj Ahirwar (@manoj_ahi) January 15, 2026
ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘నేను 2020లో నా స్టార్టప్ కంపెనీ మనీఫిట్‌ను ప్రారంభించినప్పుడు నితిన్ కామత్‌ను సంప్రదించాను. సమాధానం వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఆయన గంటలోపే స్పందించారు. అప్పట్లో నాకు పెట్టుబడి సమకూరలేదు. అయితే ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు ఇంత సులభంగా అందుబాటులో ఉండటం నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని అహిర్వార్ పేర్కొన్నారు.
రూ.1.8 కోట్ల ఆదాయం వైపు..
మనోజ్ అహిర్వార్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన అంతకుముందు రెండు స్టార్టప్‌లను ప్రారంభించి మూసివేశారు. 2022 బెంగళూరులో ‘మనీఫిట్’ను ప్రారంభించారు. కానీ అది కూడా అదే ఏడాది నిలిచిపోయింది. ప్రస్తుతం తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త వెంచర్‌తో దూసుకుపోతున్నారు. ఓ స్టార్టప్ కంపెనీని స్థాపింది సుమారు 2,00,000 డాలర్లు (సుమారు రూ.1.8 కోట్లు) వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ‘జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో నా స్టార్టప్ కంపెనీ పెట్టుబడికి సిద్ధంగా లేదని అర్థమైంది. కానీ ప్రయత్నించినందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో రిప్లై
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు అహిర్వార్ పట్టుదలను, నితిన్ కామత్ చొరవను ప్రశంసిస్తున్నారు. ‘నితిన్ కామత్ వంటి సీఈఓలు సులభంగా అందుబాటులో ఉండటం స్టార్టప్ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ‘చాలా మంది విఫలమైతే వదిలేస్తారు, కానీ మీరు పట్టుదలతో కొనసాగడం స్ఫూర్తిదాయకం’ అని మరొకరు అభినందించారు.
ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!


