ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడానికి కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే అబద్ధాలతో రెజ్యూమెలను సృష్టించి కంపెనీలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు ఇటువంటి ఫేక్ అభ్యర్థిని నమ్మి ఉద్యోగం ఇవ్వడం వల్ల తమ కంపెనీ రూ.2 లక్షలకు పైగా నష్టపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాపర్ మీడియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ గుప్తా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన వివరాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
అసలేం జరిగింది?
కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య తనిఖీ) అనవసరమని భావించినట్లు గుప్తా పేర్కొన్నారు. కేవలం అభ్యర్థి ఇంటర్వ్యూ ప్రదర్శన, గట్ ఫీలింగ్ ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఈ క్రమంలోనే చిరాగ్ అనే అభ్యర్థి కంపెనీలోకి ప్రవేశించాడు. పాత కంపెనీలో 3 ఏళ్ల అనుభవం, నెలకు రూ.40,000 వేతనం ఉండడంతో ఇంటర్వ్యూలో తన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఈ స్టార్టప్ కంపెనీ రూ.45,000 జీతం ఆఫర్ చేసింది.
నియామకం జరిగిన రెండు నెలల తర్వాత చిరాగ్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఒక సాధారణ రియాక్షన్ వీడియో ఎడిటింగ్ టాస్క్ (సాధారణంగా జూనియర్ ఎడిటర్లు రోజుకు మూడు చేస్తారు) పూర్తి చేయడానికి చిరాగ్‌కు రెండు రోజులు పట్టింది. పైగా అతను ఇచ్చిన అవుట్‌పుట్ ఏమాత్రం పనికివచ్చేది కాదు. దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం తన పాత కంపెనీని సంప్రదించింది.
వెలుగు చూసిన నిజాలు
వెరిఫికేషన్ ప్రక్రియలో చిరాగ్ ఆడిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో అతను నెలకు పొందింది రూ.25 వేలు మాత్రమే, కానీ రూ.40 వేలు అని అబద్ధం చెప్పి 80 శాతం పెంపు పొందాడు. తాను పాత కంపెనీలో రాజీనామా చేయలేదు. పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ అతన్ని తొలగించింది. కొత్త కంపెనీలో రిఫరెన్స్ కోసం అతను ఇచ్చిన మేనేజర్ నంబర్ తన స్నేహితుడిది. ఆ స్నేహితుడు మేనేజర్‌లా నటించి చిరాగ్ గురించి మంచి రివ్యూ ఇచ్చాడు.
ఈ ఒక్క తప్పుడు నియామకం వల్ల కంపెనీకి కలిగిన నష్టాన్ని గుప్తా వివరించారు. వేతన రూపంలో మూడు నెలలకు గానూ రూ.1.35 లక్షలు, శిక్షణ ఖర్చుల కింద రూ.40,000, రీప్లేస్‌మెంట్ నియామకం కింద రూ.25,000 నష్టపోయామని చెప్పారు. దీనికంటే ముఖ్యంగా క్లయింట్ ప్రాజెక్టుల జాప్యం, టీమ్ మనోధైర్యం దెబ్బతినడం, నాలుగు నెలల విలువైన సమయం వృథా అయినట్లు తెలిపారు.
స్టార్టప్‌లకు సూచనలు
ఈ చేదు అనుభవం తర్వాత ప్రాపర్ మీడియా ప్రతి నియామకానికి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల మునుపటి కంపెనీ హెచ్‌ఆర్‌కు అధికారిక మెయిల్ చేయడం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ క్రాస్ చెక్ చేయడం, అధికారిక నంబర్ల ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవడం వంటివి తప్పనిసరి చేశారు. తప్పు జరిగిన తర్వాత బాధపడేకంటే, అభ్యర్థిని కంపెనీలోకి తీసుకునే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్!


