భారతీయ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. రియల్ మనీ గేమింగ్ (RMG)పై ఉన్న ఆంక్షలు సుమారు రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య, ఈ-గేమింగ్ రంగం అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. గడిచిన ఐదు నెలలుగా పరిశ్రమ తన వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను నిలుపుకోవడమే కాకుండా కొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
కోర్ డెవలప్‌మెంట్‌కు క్రేజ్
ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ కేవలం వినోదం కోసమే కాకుండా హై-ఎండ్ గేమ్ డెవలప్‌మెంట్ హబ్‌గా మారుతోంది. ఇన్‌స్టాహైర్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. యూనిటీ (Unity), అన్‌రియల్ (Unreal) డెవలపర్లు, సీ++ ఇంజినీర్లు, 3డీ ఆర్టిస్టులు, గేమ్ డిజైనర్లకు గిరాకీ పెరిగింది. మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటా 70-80 శాతంగా ఉంది. భారతీయ స్టూడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి AAA క్వాలిటీ టైటిల్స్ రూపొందించడంపై దృష్టి పెట్టాయి. టోర్నమెంట్ మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, అనలిస్ట్ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2026 చివరి నాటికి గేమింగ్ రంగంలో ఉపాధి 60-70 శాతం వృద్ధి చెందుతుందని ఇన్‌స్టాహైర్ అంచనా వేసింది.
నియంత్రణలతో భరోసా
‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2025’ అమల్లోకి రావడం పరిశ్రమకు ఒక వరంలా మారిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్‌ఎంజీ, సాధారణ ఈ-గేమ్స్ మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పరిచినట్లు తెలుపుతున్నారు. ‘75 శాతం భారతీయ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఈ రంగాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్‌గా భావిస్తున్నారు. కేవలం ప్లేయర్లుగానే కాకుండా కోచ్‌లు, ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు 56 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు’ అని జెంట్‌సింథసిస్ సర్వే తెలిపింది.
ప్రతిభను వదులుకోని కంపెనీలు
ఆర్‌ఎంజీ కంపెనీల్లో గతంలో నియామకాలు తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఇతర గేమింగ్ విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ (Dream Sports) తమ వద్ద ఉన్న ప్రతిభను వదులుకోకుండా తమ గ్రూప్‌లోని ఇతర ఏడు ప్లాట్‌ఫారమ్‌ల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఫెలిసిటీ గేమ్స్ (Felicity Games) గతంలో ఆర్‌ఎంజీ విభాగాల్లో పనిచేసిన హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి కీలక నిపుణులను నియమించుకుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్‌ఎంజీపై ఆంక్షలు ఒక రకంగా ఇతర గేమింగ్ విభాగాలు గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయి.
ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?


