విలువైన సంస్థలకు సారథ్యం వహిస్తున్న యువ ఎంట్రప్రెన్యూర్స్ సంఖ్యపరంగా చైనాను భారత్ వెనక్కి నెట్టింది. ఆ కోవకి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు భారత్‌లో 166 మంది ఉండగా చైనాలో 140 మంది ఉన్నట్లు అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూత్ సిరీస్ 2025 ఒక నివేదికలో తెలిపింది.
100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే అంకురాలను స్థాపించిన 40 ఏళ్ల లోపు ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం 200 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య చైనాలో 54గా ఉండగా, భారత్‌లో 35గా ఉంది. ఇక 100 మిలియన్ డాలర్ల సంస్థలను స్థాపించిన లేదా 200 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలను నడిపిస్తున్న, 40 ఏళ్ల లోపు కొత్త తరం వ్యాపారవేత్తల సంఖ్య భారత్‌లో 201గా ఉండగా, చైనాలో 194గా ఉంది. ఈ జాబితాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ అగ్రస్థానంలో ఉండగా, అల్కెమీకి చెందిన నిఖిల్ విశ్వనాథన్ రెండో స్థానంలో, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ హర్షద్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.
ఈ ఎంట్రప్రెన్యూర్లు సారథ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ రూ. 31 లక్షల కోట్లుగా (357 బిలియన్ డాలర్లు) ఉందని హురున్ పేర్కొంది. ఇది భారతదేశపు జీడీపీలో 11వ వంతు అని తెలిపింది. ఈ ఎంట్రప్రెన్యూర్ల నేతృత్వంలోని కంపెనీలలో మొత్తం 4.43 లక్షల మంది పని చేస్తున్నట్లు వివరించింది. అపోలో హాస్పిటల్స్‌లో అత్యధికంగా 42,497 మంది ఉద్యోగులు ఉన్నారు. ముప్ఫైల మధ్యలో ఉన్న చాలా మంది ఫిన్‌టెక్, సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సరీ్వస్), హెల్త్‌కేర్, క్లీన్ ఎనర్జీ తదితర విభాగాల్లో తమ సంస్థలను అగ్రగాములుగా తీర్చిదిద్దుతున్నట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు.


