రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా! | meet ShareChat cofounder Ankush Sachdeva Who Failed 17 Times Built Rs 40k Crore Company | Sakshi
Sakshi News home page

రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!

Jan 22 2026 1:38 PM | Updated on Jan 22 2026 2:43 PM

meet ShareChat cofounder Ankush Sachdeva Who Failed 17 Times Built Rs 40k Crore Company

ప్రతిష్టాత్మక  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ఐఐటీ కాన్పూర్‌లో చదువు, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేతికి కాగానే భారీ ఆఫర్‌తో ఉద్యోగం ఖాయం.  బీటెక్‌  ఆఖరి సంవత్సరంలోతన బ్యాచ్‌మేట్స్ అందరికి గ్లోబల్‌ దిగ్గజ సంస్థలనుంచి భారీ వేతనంతో ఉద్యోగ ఆఫర్లు అందుకున్నారు.  కానీ ఒక యువకుడి ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది.  తన  కలను సాకారం చేసుకునే ప్రయోగాల్లో బిజీగా ఉన్నాడు. ఎందరు నవ్వినా, హేళన చేసినా పట్టించుకోలేదు.  ఆయనే బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీకి వ్యవస్థాపకుడిగానిలిచిన అంకుష్ సచ్‌దేవా కథ సాధారణ IIT మేధావి కథ కాదు. దానికంటే కఠినమైనది, మరింత మానవీయమైనది. ఎంతో ఇష్టంగా కష్టపడిన  నిలిచి గెలిచినప్రయోగశీలి కథ.  పదండి కథేంటో తెలుసుకుందాం.

అంకుష్ సచ్‌దేవా కాన్పూర్ నుంచి పట్టభద్రుడయ్యాక మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంటర్న్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. కార్పొరేట్ ప్రపంచం అతని అభిరుచిని మరిపించలేకపోయింది. వ్యవస్థాపకత మార్గంలో నడిచేలా చేసింది. సచ్‌దేవా తన కెరీర్ ప్రారంభ దశలో 17 విభిన్న స్టార్టప్  ప్రయత్నాల్లో  వైఫల్యం చెందాడు. అవును..అతని గుండె గదుల్లోంచి ఉద్భవించిన ‍ప్రతీ ఆలోచన ఇ-కామర్స్ నుండి యుటిలిటీస్ వరకు  దాదాపు అన్నీ క్రాష్. కానీ వైఫల్యాలనే తన విజయానికి మెట్లుగా వాడుకున్నాడు. ఓటమి నుంచే నేర్చుకున్నాడు. ప్రతి వైఫల్యం ఒక ముఖ్యమైన డేటాపాయింట్. కట్‌ చేస్తే.. 18వ ప్రయత్నంలో ఇద్దరు సహచరులతో కలిసి అతను అసాధారణమైన దాన్ని సాధించాడు.

2015లో తన IIT కాన్పూర్ స్నేహితులు ఫరీద్ అహ్సాన్ , భాను సింగ్ లతో జతకట్టాడు. ఇంటర్నెట్‌ ప్రపంచంలో మునిగి తేలుతున్న సమయంలో  ఇదొక విప్లవాత్మక ఆలోచన, స్థానికమైన భాషను మాట్లాడే సోషేల్‌ స్లేస్‌ షేర్‌చాట్‌ను నిర్మించారు. తొలుత హిందీతో ప్రారంభమైనప్పటికీ, ఆ తరువాత  15 భారతీయ భాషలలోకి వికసించింది. ఫేస్ బుక్, వాట్సాప్ కంటే కొత్త అనుభవాలను కోరుకునే వినియోగదారులకు  వరంలా మారింది.

ప్రాంతీయ భాషలే బలం
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి ఇంగ్లీష్‌పై దృష్టి పెడితే, షేర్‌చాట్ మాత్రం భారతదేశంలోని ప్రాంతీయ భాషల (తెలుగు, హిందీ, తమిళం మొదలైన 15 భాషలు) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. "మన భాషలో మన సోషల్ మీడియా" అనే నినాదమే విజయానికి పునాది వేసింది. షేర్‌చాట్ కంటే ముందు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ ముగ్గురు స్నేహితులు యూజర్లు ప్రాంతీయభాషల్లో కంటెంట్‌ను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారని గ్రహించారు. ఫలితంగా గ్లోబల్ కంపెనీలకు ధీటుగా సొంత ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించుకోవచ్చని నిరూపించేలా షేర్‌చాట్‌ను తీసు కొచ్చారు. 

ప్రపంచ ఇంటర్నెట్‌కు కనిపించకుండా ఉన్న లక్షలాది మందిని, మూల మూలన ఉన్న వారిని ఏకం చేసింది. పంజాబ్‌లోని ఒక రైతును అస్సాంలోని ఒక కవితో కలిపింది. మధ్యప్రదేశ్‌లోని ఒక గృహిణి  వంటకాల ఛానెల్‌  వైరల్‌ అయింది. కేవలం ఆరేళ్ళకు 2021 నాటికి, దీనికి 160 మిలియన్లకు పైగా  యూజర్లు వచ్చి చేరారు. భారీ ఆదరణతో పాటు కంపెనీ విలువ కూడా పెరిగింది. షేర్‌చాట్ 2021లోనే 'యూనికార్న్' (1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీ) క్లబ్‌లో చేరింది. 2022 నాటికి ఇది అక్షరాలా రూ. 40,000 కోట్లకు (సుమారు 5 బిలియన్లు డాలర్లకు) చేరింది.

2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు  k రూ.723 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఇది ఏడాదికి₹1,000 కోట్ల ఆదాయ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది.కేవలం సోషల్ మీడియాగానే కాకుండా, ఇప్పుడు మైక్రో డ్రామా (Micro-dramas) ,లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ లాభాల దిశగా ప్రయాణిస్తోంది.

అంకుష్ సచ్‌దేవా పేరు స్టార్టప్ పరిశ్రమలో అత్యంత స్ఫూర్తిదాయకమై పేరు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే తపనతో ఉన్న ఈ ప్రపంచంలో, ప్రతీ ప్రతికూలతనుంచి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ  ఎంతో శ్రద్ధగా నిర్మించుకున్న వైభవం. దాని గొప్పతనానికి నిదర్శనమైన స్ఫూర్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement