ఉఫ్‌.. బిగ్‌ రిలీఫ్‌! | breakdown of RBI new selling rules for banks and financial products | Sakshi
Sakshi News home page

ఉఫ్‌.. బిగ్‌ రిలీఫ్‌!

Feb 16 2026 8:28 AM | Updated on Feb 16 2026 9:23 AM

breakdown of RBI new selling rules for banks and financial products

కస్టమర్ల హక్కులకు ఆర్‌బీఐ దన్ను

బ్యాంకులు, ఆర్థిక సంస్థల మిస్‌–సెల్లింగ్‌కు ముకుతాడు

రుణం పొందాలంటే బీమా తీసుకోవాలని ఒత్తిడి చేయకూడదు

బండిల్స్‌ వద్దు.. ప్రతి ఉత్పత్తికీ విడిగా సమ్మతి తీసుకోవాల్సిందే

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే టెలీమార్కెటింగ్‌ కాల్స్‌

డీఎన్‌డీలో నమోదు చేసుకున్నవారికి కాల్స్‌ చేయకూడదు.

రిస్కులు, చార్జీల గురించి బ్యాంకులు తప్పనిసరిగా చెప్పాల్సిందే

కన్ఫర్మేషన్, అగ్రిమెంట్‌ కాపీ కస్టమర్లకు తప్పకుండా ఇవ్వాలి.

మిస్‌–సెల్లింగ్‌ రుజువైతే, పూర్తి రిఫండ్‌తో పాటు పరిహారం కూడా...

రాజ్యలక్ష్మి(68) రిటైర్డ్‌ గవర్నమెంట్‌ టీచరు. ఉండేది హైదరాబాద్‌లో. ఎఫ్‌డీని రెన్యువల్‌ చెయ్యడానికి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది రెన్యువల్‌ చెయ్యకుండా... ఎఫ్‌డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందంటూ మార్కెట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్‌ చేయించారు. రెండేళ్లు గడిచాయి. మార్కెట్‌ పడిపోవడంతో ఆమె పెట్టుబడిలో 18 శాతం వరకూ పోయింది. ఎఫ్‌డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందన్నారు కదా? అంటూ బ్యాంకును నిలదీశారు. ‘‘మార్కెట్‌ లింక్డ్‌ సాధనాల్లో ఇవి సహజం. మీరూ ఒప్పుకుని సంతకం చేశారు కదా?’’ అని బ్యాంకు వాళ్లు చూపించటంతో లక్ష్మి హతాశురాలయ్యారు.

  • ఇక వెంకటాచలం అయ్యర్‌ అనే 90 ఏళ్ల వ్యక్తికి ఏటా రూ.2 లక్షల ప్రీమియంతో 2124లో అంటే, వందేళ్ల తర్వాత మెచ్యూరయ్యే జీవిత బీమా పాలసీని అంటగట్టింది మరో బ్యాంకు. దీనిపై సోషల్‌ మీడియాలో నానా రచ్చ  జరిగేసరికి సైలెంటుగా రిఫండ్‌ చేసేసింది.  ఈ నేపథ్యంలో కస్టమర్లకుండే హక్కులను వివరించేదే ఈ వెల్త్‌ స్టోరీ..

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని, అనవసరమైన ఉత్పత్తుల్ని బలవంతంగా కొనిపించేదంతా మిస్‌–సెల్లింగే. దీన్నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ తొలిసారి స్పష్టమైన చర్యలకు దిగింది. ‘రెస్పాన్సిబుల్‌ బిజినెస్‌ కండక్ట్‌ అమెండ్‌మెంట్‌ డైరెక్షన్స్‌ – 2026’ ముసాయిదా ప్రకారం మిస్‌ సెల్లింగ్‌ రుజువైతే, కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేయాలి. సదరు ప్రోడక్టు విక్రయాన్ని రద్దు చేయాలి. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న ఈ నిబంధనలతో మిస్‌–సెల్‌ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై పడుతుంది.

మిస్‌–సెల్లింగ్‌ ఇదీ...

  • రిజర్వ్‌ బ్యాంక్‌ తొలిసారిగా మిస్‌–సెల్లింగ్‌కంటూ స్పష్టమైన నిర్వచనాలిచ్చింది. అవేంటంటే...

  • కస్టమర్‌ ప్రొఫైల్‌కి అనువుగా లేని ఉత్పత్తులను విక్రయించటం

  • పూర్తిగా, లేక సరైన వివరాలు ఇవ్వకుండా అమ్మడం

  • బండిల్‌గా ప్రోడక్టులను అంటగట్టడం

  • కస్టమరు నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండానే విక్రయించడం

ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్టమరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్‌పై సంతకాలు చేసినా, ప్రోడక్టు గానీ అనువైనది కాకపోతే అది మిస్‌–సెల్లింగ్‌ కిందికే వస్తుంది. ఇప్పటివరకు కస్టమర్ల సంతకాలు, డిజిటల్‌ క్లిక్‌లు అనే లూప్‌హోల్‌ని అడ్డం పెట్టుకుని, బయటపడిపోయిన బ్యాంకులు ఇకపై అలాంటివి చేయటానికి కుదరదు. ఆర్‌బీఐ కొత్త ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం రాజ్యలక్ష్మి ఎదుర్కొన్నది మిస్‌ సెల్లింగే. ఎందుకంటే ఆమె వయస్సు, రిస్కు సామర్థ్యాల రీత్యా మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్కీ వ్యవహారమే. పెట్టుబడికి కూడా హాని ఉంటుందనే విషయం సరిగ్గా చెప్పకుండా ఆమెకు అరకొర సమాచారమే ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆమెకు పూర్తి రిఫండ్‌ చేయాల్సి ఉంటుంది.

బలవంతంగా బండిల్‌ చేయొద్దు..

  • రుణం ఇవ్వాలంటే ఆ రుణానికి బీమా తీసుకోవాలంటూ బ్యాంకులు లింకు పెట్టడం సహజం. ఇదే బండ్లింగ్‌. ఒకటి కావాలంటే మరొకటి కూడా జత కలపటం. ఆర్‌బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం...

  • రుణం కోసం తప్పనిసరిగా తాము చెప్పే బీమా పాలసీని తీసుకోవాల్సిందే అంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడానికి ఉండదు.

  • నచ్చిన ఏ కంపెనీ నుంచైనా థర్డ్‌ పార్టీ 
    ప్రోడక్టులను కొనుక్కునేందుకు కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుంది.

  • కస్టమర్లు స్పష్టంగా సమ్మతించకుండా, రుణ మొత్తం నుంచి బీమా లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోడక్టులకు సంబంధించిన డబ్బును కట్‌ చేసుకోవడానికి ఉండదు.  

  • కస్టమర్ల సమ్మతి అనేది నిర్దిష్టంగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని ఇచ్చినట్లుగా ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.

  • వివిధ ప్రోడక్టులన్నింటికీ కలిపి ఒకే ఫారంలో లేదా డిజిటల్‌ చెక్‌బాక్స్‌ ద్వారా సమ్మతి తీసుకోవడానికి కుదరదు. ప్రతి ప్రోడక్టుకు విడిగా అప్రూవల్‌ తీసుకోవాల్సిందే.  

డిజిటల్‌ ‘డార్క్‌ ప్యాటర్న్స్‌’ కట్టడి

బ్యాంకులు ఇకపై కస్టమర్లను మభ్యపెట్టే ‘డార్క్‌ ప్యాటర్న్స్‌’లాంటి డిజిటల్‌ మాయవేషాలు వేయడానికి ఉండదు. ఈ డార్క్‌ ప్యాటర్న్స్‌ ఏమిటంటే..

  • ఇదిగో మరికాసేపట్లోనే ఆఫర్‌ ముగిసిపోతుంది, త్వరపడకపోతే నష్టపోతారనే విధంగా కంగారు పెట్టేయడం  

  • ముందే యాడ్‌–ఆన్స్‌ని సెలెక్ట్‌ చేసేసి ఉంచడం

  • ప్రీ–అప్రూవ్డ్‌ క్రెడిట్‌ కార్డులంటూ ఇచ్చేసి, కార్డ్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్లలాంటివి అంటగట్టడం

  • పేమెంట్‌ దశవరకు ఇతర చార్జీల గురించి చెప్పకుండా దాచి పెట్టి ఉంచడం

  • అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేసేందుకు సంబంధించిన ఆప్షన్లు గందరగోళంగా ఉండటం

ఇలాంటివి చేయకుండా కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ మార్గనిర్దేశకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. తమ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లను తరచుగా ఆడిట్‌ చేసుకుంటూ ఉండాలి. దీనితో యాప్‌–ఆధారిత బ్యాంకింగ్‌లో పారదర్శకత గణనీయంగా మెరుగుపడుతుంది.  

టార్గెట్లే మిస్‌–సెల్లింగ్‌కి మూలం..

అసలు మిస్‌–సెల్లింగ్‌కి మూలకారణం ఉద్యోగులకు ఉండే భారీ సేల్స్‌ టార్గెట్లు, ప్రోత్సాహకాలే. కాబట్టి ఇకపై బ్యాంకులు ఏవి చేయకూడదో ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది. అవి...

  • సేల్స్‌ కోసం అంతర్గతంగా పోటీ పెట్టడం

  • స్పెషల్‌ ‘టార్గెట్‌ డేస్‌’ని నిర్దేశించడం

  • ఎలాగైనా ప్రోడక్టును అంటగట్టేలా ప్రోత్సహించే ప్రోత్సాహకాల విధానాలు

  • థర్డ్‌ పార్టీ ప్రోడక్టులను విక్రయించే ఉద్యోగులు నేరుగా గానీ పరోక్షంగా గానీ సదరు సంస్థల నుంచి ప్రోత్సాహకాలేవీ పొందకూడదు. రిలేషన్‌షిప్‌ మేనేజర్లు టార్గెట్లను పూర్తిచేసేందుకు, తమకు భారీగా కమీషన్‌ వచ్చే ప్రోడక్టులను అంటగట్టకుండా ఇలాంటివి కట్టడి చేస్తాయి.  

టెలీమార్కెటింగ్‌ కష్టాలకు చెక్‌

  • కొత్త రూల్స్‌ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కాల్స్‌కి అనుమతి ఉంటుంది

  • డీఎన్‌డీ కింద రిజిస్టర్‌ చేసుకుంటే అసలు కాల్‌ చేయడానికే ఉండదు

  • ఏజెంట్లు తాము కూడా బ్యాంకు ఉద్యోగులమే అన్నట్లుగా వ్యవహరించకూడదు

  • ప్రమోషనల్‌ మెసేజీలను కస్టమర్లు స్పష్టంగా సమ్మతిస్తేనే పంపాలి. అన్‌సబ్‌స్క్రైబింగ్‌ ప్రక్రియ కూడా సరళంగా ఉండాలి.

ఇదీ చదవండి: విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే

Advertisement
 
Advertisement
Advertisement